ఖైరతాబాద్ అసెంబ్లీ నియోజకవర్గానికి రాబోయే ఉప ఎన్నిక (బై ఎలక్షన్) రాజధాని హైదరాబాద్ రాజకీయాల్లో తీవ్ర ఉత్కంఠను రేకెత్తిస్తోంది. ప్రధాన రాజకీయ పార్టీలైన కాంగ్రెస్, బీఆర్ఎస్, భారతీయ జనతా పార్టీలు గెలుపే లక్ష్యంగా అభ్యర్థుల ఎంపిక ప్రక్రియపై ముమ్మర కసరత్తు ప్రారంభించాయి. మూడు కీలక పార్టీల నుంచి బలమైన నాయకుల పేర్లు ప్రచారంలోకి రావడంతో ఖైరతాబాద్‌తో పాటు నగర రాజకీయాల్లో రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది.
కాంగ్రెస్ రేసులో దానం నాగేందర్, విజయా రెడ్డిల పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. గతంలో ఈ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించిన దానం నాగేందర్‌కే మరోసారి టికెట్ దక్కే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని ప్రచారం సాగుతున్నప్పటికీ, అధిష్టానం (హైకమాండ్) తీసుకునే తుది నిర్ణయంపైనే సర్వత్రా ఆసక్తి నెలకొంది.
బిఆర్ఎస్ తరఫున రేసులో ముఖ్యంగా తలసాని సాయికిరణ్ యాదవ్, నియోజకవర్గంలో పట్టున్న బీఆర్ఎస్ సీనియర్ నేత దాసోజు శ్రవణ్ పేర్లను అధిష్టానం నిశితంగా పరిశీలిస్తోంది. స్థానిక సమీకరణాలు, కేడర్ మద్దతును పరిగణనలోకి తీసుకుని అభ్యర్థిని ఖరారు చేసే యోచనలో ఉంది.
బిజెపి నుంచి మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి పేరు ప్రధానంగా ప్రచారంలో ఉంది. ఖైరతాబాద్‌లో గతంలో గెలిచిన అనుభవం, స్థానికంగా ఉన్న క్యాడర్ బలం కలసివస్తుందని కమలం పార్టీ భావిస్తోంది.
హైదరాబాద్ నడిబొడ్డున ఉన్న ఖైరతాబాద్ నియోజకవర్గాన్ని దక్కించుకోవడం మూడూ పార్టీలకు ప్రతిష్టాత్మకంగా మారింది. ప్రచార వ్యూహాలు, సమీకరణలతో ఖైరతాబాద్ ఉప ఎన్నికల సమరం ఆసక్తికరంగా మారబోతోంది.
Also Read:దేవుళ్ల పేరుతో రేవంత్ రాజకీయ చిచ్చు!

