మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా వి.వి.వినాయక్ దర్శకత్వంలో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న చిత్రం `ఖైదీ నంబర్ 150`. కోణిదెల ప్రొడక్షన్ కంపెనీ పతాకం పై మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ నిర్మిస్తున్నారు. దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ శనివారం సాయంత్రం గుంటూరు జిల్లా మంగళగిరి మండలం చినకాకాని హాయ్‌ల్యాండ్‌లో అభిమానులు, సినీ, రాజకీయ ప్రముఖుల సమక్షంలో ఘనంగా జరిగింది. ముఖ్య అతిధిగా విచ్చేసిన దర్శకరత్న దాసరి నారాయణరావు థియేట్రికల్ ట్రైలర్ ను ఆవిష్కరించారు. అనంతరం..
మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ “ ఈలలు, కేకలు, కేరింతలు, చప్పట్లు విని చాలా సంవత్సరాలైంది. వీటి శక్తి ఏంటన్నది అనుభవ పూర్వకంగా తెలిసినవాడిని. కాబట్టి ఈ కేకలు కేరింతలు కోసం చాలా సంవత్సరాలు గా ఎదురుచూసి ఇలా మళ్లీ మీ ముందుకు వచ్చాను. ఇక్కడున్న అభిమానులను చూస్తూంటే విజయవాడ కృష్ణానదీ తీరా ఉన్నానా? విశాఖ సముద్ర తీరాన ఉన్నానా? అని నాకే అనుమానంగా ఉంది. తుఫాన్ సమయంలో సముద్రం చేసే కోలాహాలాన్ని మించి ఈ రోజున మీ యెక్క కేకలు..కేరింతలు అంతకన్నా ఉదృతంగా ఉన్నాయి. మీరంతా ఆశీస్సులు ఇస్తూ బాస్ కమ్ బ్యాక్ అంటూ పెద్ద ఎత్తున పిలుస్తుంటే చాలా సంతోషంగా ఉంది.
ఆత్మీయత పంచుకోవడానికి వచ్చిన పెద్దలు ఇక్కడకు విచ్చేసిన దాసరి నారాయణరావు గారు గురించి ఒక మాట చెప్పాలి. సినిమా ప్రారంభంలో ఖైదీ డ్రెస్ వేసుకున్న ఓ స్టిల్ బయటకు వచ్చినప్పుడు అది చదవిన దాసరి గారు ఈ సినిమాకు ఖైదీ నంబర్ 150 పెట్టాలని సూచించారు. తర్వాత డైరెక్టర్ తర్వాత డిస్కస్ చేసి దాసరి గారి లాంటి పెద్దలు డిసైడ్ చేయడంతో టైటిల్ ను `ఖైదీ నంబర్ 150`గా ఖరారు చేశాం. బాస్ బ్యాక్ అంటే ఓ విషయం గుర్తుకు వస్తుంది. మనం ఇద్దరం కలిసి కొంత కాలం గడిపాం. ఆ తర్వాత వీడ్కోలు చెబుతూ విడిపోయాం. మళ్లీ స్వాగతిస్తూ కలిసినప్పుడు మనం విడిపోయిన తర్వాత నేను గడిపిన కాలం నాకు అసలు గుర్తే లేదు’ అంటూ ఓ కవి పలికిన కవిత గుర్తొస్తోంది. ఈ పది సంవత్సరాలు 10 క్షణాల్లా గడిచిపోయాయి. ఆ సమయం తెలియకుండా జరగడానికి లోపల నన్ను నడిపించిన శక్తి ఏమిటి? అని నాలో ఓ ప్రశ్న ఉదయించింది. పది సంవత్సరాల తర్వాత కూడా 25 సంవత్సరాల ముందున్న వూపు, ఉత్సాహం నాలో నింపిన ఆ శక్తి ఏమిటి? ఈ పది సంవత్సరాల వ్యవధిలో నన్ను మీ గుండెలకు అతి దగ్గరగా ఉంచుకుని అక్కున చేర్చుకుని ఇంత ప్రేమ చూపిన ఆ శక్తి పేరు.. ఆ అభిమానం పేరు.. నా తమ్ముళ్లు.. సోదరులు.. వారు చూపిన ఆత్మీయత, ప్రేమ. ఖైదీ కథ కు ముందు చాలా కథలు విన్నా. కానీ ఏ కథ ఫుల్ మీల్స్ లాంటి సినిమా అనిపించలేదు. ఆ సమయంలో మురగదాస్ డైరెక్ట్ చేసిన `కత్తి` సినిమా చూసి రీమేక్ చేస్తే బాగుటుందని డిసైడ్ అయ్యా.
అభిమానులకు కావాల్సిన అన్ని అంశాలు ఇందులో ఉన్నాయి. ఈ కథ అనగానే నాకు వినాయక్ అయితేనే బాగుంటుందనిపించింది. మరో డైరెక్టర్ నా దృష్టిలోకి రాలేదు. నా మొదటి విజయం ఈ సినిమాను వినాయక్ డైరెక్ట్ చేయడంగా భావిస్తున్నా. డ్యాన్స్ , ఫైట్స్, ఎమోషన్స్, సామాజిక బాధ్యతను తెలియజెప్పేలా ఆద్యంతం ఆసక్తికరంగా వినాయక్ డైరెక్ట్ చేశాడు. చరణ్ ధృవ సినిమా టైమ్ లో బిజీగా ఉన్నప్పుడు వినాయక్ నిర్మాత బాధ్యతలను కూడా చేపట్టాడు. ఇందులో కాజల్ నాతో పోటీ పడి నటించింది. కాజల్‌ది ఓ ప్రత్యేక రికార్డు. గతంలో తండ్రితో చేసి కుమారుడితోనూ చిత్రాలు చేశారు. కానీ కాజల్ ఓ కుమారుడితో హిట్ సినిమాలు చేసి తండ్రితో కూడా సినిమా చేసిన ఘనత ఆమెది. పరుచూరి బ్రదర్స్ లాజిక్‌లకు దగ్గరగా సినిమాకు రచనా సహకారం అందించారు.
ఈ మూవీ తర్వాత వినాయక్ తో నా అనుబంధం మరింత బలపడింది. కెమెరామెన్ రత్నవేలు పాత చిరంజీవిలా చూపించారు. దేవీ అందించిన పాటలు ఆణిముత్యాల్లా యూ ట్యూబ్ లోకి దూసుకుపోయాయి. ఆయన ట్యూన్స్ నాకు మంచి ఊపునిచ్చాయి. రామ్ చరణ్ సమర్దవంతంగా సినిమాను నిర్మించాడు. మనకున్న పెద్ద నిర్మాతలల సరసన చెర్రీ కూడా నిలబడతాడు. అలాగే సంక్రాంతికి వచ్చే ప్రతీ సినిమా ఆడాలి. నా సోదరుడు బాలకృష్ణ సినిమా ‘గౌతమిపుత్ర శాతకర్ణి’, శర్వానంద్ ‘శతమానం భవతి’ చిత్రాలు విజయం సాధించాలని కోరుకుంటున్నా. అలాగే ఇక్కడుకు విచ్చేసిన సుబ్బరామిరెడ్డి గారు, మంత్రులు పత్తిపాటి పుల్లారావు, కామినేని శ్రీనివాసరావు, ఇతర ప్రముఖులు, దర్శక, నిర్మాతలకు కృతజ్ఞతలు ’’ అని అన్నారు.
దర్శకరత్న దాసరి నారాయణరావు మాట్లాడుతూ “చిరంజీవి సినిమా చూసిన తర్వాత థియేటర్ నుంచి బయటకు వచ్చిన ప్రేక్షకులు చిరు ఇరగదీశాడు రా’ అంటారు. దాదాపు ఏనిమిది ఏళ్ల తర్వాత చిరంజీవి మళ్లీ నటించడం చరిత్రలో మొదటిసారి. ఎప్పుడు మేకప్ వేసుకుంటారా? ఎప్పుడు కథను ఫైనలైజ్ చేస్తారా? ఎప్పుడు చూస్తామా? అని ఎదురు చూసిన అభిమానులకు సమాధానం ‘ఖైదీ నంబర్ 150’. కేవలం కృషి, పట్టుదలతో పైకి వచ్చిన వ్యక్తి చిరంజీవి. ‘ఖైదీ’ కోసం ఎంత కష్టపడ్డారో మీకు తెలుసా? ఇప్పుడు ఎనిమిదేళ్ల తర్వాత చిరంజీవి నటిస్తుంటే జనం చూస్తారా? డ్యాన్స్ చేస్తాడా? ఫైట్స్ చేస్తాడా? అనుకున్న వారందరికీ ఇదే సమాధానం. చిరంజీవి 25ఏళ్లు కుర్రాడిగా కనిపించబోతున్నారు అంటే ఏడాదిగా ఆయన చేసిన కృషి అనిర్వచనీయం. ఈ సినిమా బిగినింగ్‌లో ఓ పాటను చూశా. ఆ పాట చూసిన తర్వాత నటించింది చిరంజీవా.. రామ్‌చరణా.. అల్లు అర్జునా.. అనిపించింది. వారు కూడా సరిపోరు అంటారు మీరు. ఈ సినిమాలో ఇంటర్వెల్ ఫైట్ ఉంది. బయటకు వచ్చి తర్వాత చిరంజీవి ఇరగదీశాడు అంటారు మీరంతా. 11వ తేదీనే సంక్రాంతి వచ్చినట్టు లెక్క. మళ్లీ ఠాగూరు ను దాటి ఈచిత్రాన్ని వినాయక్ తీర్చిదిద్దాడు. ఈ చిత్రం సమాజానికి ఓ సందేశాన్ని ఇవ్వడానికి వస్తోంది. చిరంజీవి ఇప్పటిరవకూ ఎందరో నిర్మాతలతో చేశాడు. ఫస్ట్ టైమ్ ఒకస్టార్ కొడుకు మరోస్టార్ తో సినిమా నిర్మించడం చరిత్రలో ఇదే రికార్డు సృష్టిస్తుంది` అని అన్నారు.
మెగా బ్రదర్ నాగబాబు మాట్లాడుతూ “అన్నయ్య ఈజ్ బ్యాక్. అన్నయ్య రాజకీయాలు అనంతరం మరో సినిమా చేస్తే బాగుంటుందని గాఢంగా కోరుకున్నా. నాలాంటి ఎంతో మంది వ్యక్తుల కోరికులను మన్నించి మళ్లీ అధ్బుతమైన సినిమా ద్వారా కనిపిస్తున్నందుకు మీ అందరి తరుపున అన్నయ్యకు థాంక్స్ చెబుతున్నా. అన్నయ్య సినిమా చూడాలని ఆత్రుతగా ఎదురు చూస్తున్నా. ఇంద్ర తర్వాత థియేటర్ కు వెళ్లి సినిమా చూడాలనిపిస్తుంది. సంక్రాంతికి ఈ సినిమా వస్తుంది. ఆ టైమ్ లో వస్తోన్న ప్రతీ సినిమా హిట్ అవ్వాలని కోరుకుంటున్నా` అని అన్నారు.
హీరోయిన్ కాజల్ అగర్వాల్ మాట్లాడుతూ “ వేదికపై మాట్లాడటం కష్టంగా ఉంది. మన మధ్యమనికి అప్పుడప్పుడు మనికి ఒక చిన్న కాన్పిడెన్స్ ఉంటుంది. కానీ నాకు ఓ డిఫైనింగ్ మూమెంట్ ఉంటుంది. అదే మెగాస్టార్ చిరంజీవి. మనందరికీ ఆయన స్ఫూర్తిదాయకం. ఆయనతో స్ర్కీన్ షేర్ చేసుకోవడం జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేను. చరణ్ ఒక సినిమా ప్రొడ్యూస్ చేయడం ఒక లెవల్. కానీ మెగాస్టార్ చిరంజీవి గాకి 150వ సినిమాను చరణ్ ప్రొడ్యూస్ చేయడం మరో లెవల్. తొలుత చెర్రీ నాకు మంచి స్నేహితుడు. తర్వాత కోస్టార్. ఇప్పుడు నిర్మాతగా చేయడం గొప్పగా ఉంది“ అని అన్నారు.
చిత్ర నిర్మాత రామ్ చరణ్ మాట్లాడుతూ “ వినాయక్ లేకపోతే మూవీ అయ్యేది కాదు. డైరెక్టర్ గానే కాదు ప్రొడ్యూసర్ బాధ్యతలు కూడా ఆయనే తీసుకున్నారు. బాగా తీశారు. జనవరి 11న రిలీజ్ చేస్తున్నాం` అని అన్నారు.
చిత్ర దర్శకుడు వి.వి.వినాయక్ మాట్లాడుతూ “ అన్నయ్య నాకు మంచి సినిమాను డైరెక్ట్ చేసే అవకాశం ఇచ్చారు. నా సినిమాలన్నీ మానాన్న గారు కరెక్ట్ చేసేవారు. తర్వాత ఆ లోటును చిరు అన్నయ్య తీర్చారు. అన్నయ్య సినిమాలో కోరుకున్న అంశాలన్నీ ఈ సినిమాలో ఉంటాయి. సినిమా సూపర్ డూపర్ హిట్ అవుతుంది` అని అన్నారు.
ఇంకా ఈ వేడుకలో పరుచూరి బ్రదర్స్, అ్లల్లు అరవింద్, అల్లు అర్జున్, శిరీష్, రత్నవేలు, దేవీ శ్రీ ప్రసాద్, బ్రహ్మానందం, అశ్వినీ దత్, ఎన్.వి. ప్రసాద్, శరత్ మారార్, డి.వి.వి దానయ్య, అలీ, సాయిధరమ్ తేజ్, వరుణ్ తేజ్, తదితరులు పాల్గొన్నారు.