మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తోన్న 150వ సినిమా ‘ఖైదీ నెం. 150’. సినిమా మొదలు కొని రోజుకో వార్తతో విపరీతమైన ఆసక్తి రేకెత్తిస్తూ వస్తోంది. అందుకు తగ్గట్టే నిర్మాత రామ్ చరణ్ కూడా ఎక్కడా తగ్గకుండా భారీ బడ్జెట్‌తో సినిమాను నిర్మిస్తున్నారు.కొన్ని సంవత్సరాల తరువాత ‘చిరంజీవి’ వెండితెరపై ఎలా కనబడుతారోనన్న ఉత్కంఠ నెలకొంది. చిత్రానికి సంబంధించిన ఫొటోలు బయటకు వస్తుండడంతో చిత్రంపై భారీ అంచనాలు నెలకొంటున్నాయి. శరవేగంగా షూటింగ్ జరుపుకొంటోంది. తాజాగా క్లైమాక్స్ సీన్స్ చిత్రీకరిస్తున్నట్లు తెలుస్తోంది. విలన్ల తో ‘చిరు’ పోరాడే సన్నివేశాలకు సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి.
ఆ ఫోటోస్ చూసిన అభిమానులు కాస్త కంగారు పడినా….. అవి చిరంజీవి 150వ సినిమా క్లైమాక్స్ సీన్స్ కు సంబంధించిన ఫోటోస్ కావడంతో ఊపిరి పీల్చుకున్నారు. మెగాస్టార్ చిరంజీవి… వయసు 60 సంవత్సరాలు పైబడినా నవయువకుడిలా వెలిగిపోతున్నారు. ఈ షెడ్యూల్ కోసం టీమ్ ఫైట్ మాస్టర్ కనల్ కణ్ణన్‌ను ప్రత్యేకంగా రంగంలోకి దింపింది. ఈ సినిమాకు పనిచేస్తోన్న రామ్-లక్ష్మణ్‌లతో కాకుండా, క్లైమాక్స్ ఫైట్‌ను డిఫరెంట్‌గా ఉండేలా కనల్ కణ్ణన్‌తో డిజైన్ చేయించారు. ఫైట్ సీన్స్ ఎలా ఉంటాయోనని అభిమానులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు.
వీవీ వినాయక్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి నెలలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రాన్ని అనుకున్న విధంగా సంక్రాంతికి రిలీజ్ చేయాలని యూనిట్ భావిస్తోంది. అందుకే ‘చిరంజీవి’తో సహా ప్రతి ఒక్కరూ పగలు రాత్రి తేడా లేకుండా షూటింగ్ లో పాల్గొంటున్నారని సమాచారం.