కన్నడ రాకింగ్ స్టార్ యశ్ కథానాయకుడిగా నటించిన `కేజీఎఫ్ చాప్టర్- 1` సంచలనాల గురించి తెలిసిందే. వరల్డ్ వైడ్ బాక్సాఫీస్ వద్ద అద్భుత వసూళ్లు సాధించింది. ప్రశాంత్ నీల్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించగా హోంబలే ఫిలింస్ సంస్థ అత్యంత భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని తెరకెక్కించింది. కన్నడం,హిందీ, తెలుగు, తమిళంలో చక్కని వసూళ్లతో ఆకట్టుకుంది. ప్రస్తుతం ఈ ఫ్రాంఛైజీలో సీక్వెల్ సినిమా కేజీఎఫ్ ఛాప్టర్ 2 ఆన్ సెట్స్ ఉన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా చిత్రీకరణ శరవేగంగా పూర్తవుతోంది.
తాజాగా షెడ్యూల్స్ వివరాల్ని చిత్రయూనిట్ తెలియజేసింది. ప్రస్తుతం బెంగళూరులో షూటింగ్ చేస్తున్నారు. తర్వాత మైసూర్లో షూటింగ్ చేస్తారు. అటుపై రామోజీ ఫిలింసిటీ షెడ్యూల్ ఉంటుంది. చివరిగా కర్నాటక- భళ్లారిలో షెడ్యూల్తో మెజారిటీ పార్ట్ చిత్రీకరణ పూర్తవుతుంది. దాదాపు 80-90శాతం అప్పటికి పూర్తవుతుంది అని కేజీఎఫ్ టీమ్ అధికారికంగా ప్రకటించింది.
చాప్టర్ 2లో పలువురు క్రేజీ బాలీవుడ్ స్టార్లు కీలక పాత్రలు పోషించనున్నారు. ఈ సీక్వెల్లో తొలి భాగాన్ని మించి భారీ యాక్షన్ని చూపించనున్నామని దర్శకుడు ప్రశాంత్ నీల్.. యశ్ ఇదివరకూ వెళ్లడించారు. కేజీఎఫ్ అంటే కోలార్ బంగారు గనులు (కోలార్ గోల్డ్ ఫీల్డ్స్) అని అర్థం. దశాబ్ధాల క్రితం కోలార్ బంగారు గనుల్లో మాఫియా కథతో ఈ చిత్రం తెరకెక్కుతోంది. కేజీఎఫ్ గనులపై ప్రపంచ మాఫియా కన్ను ఎలా ఉండేది అన్నదానిని తొలి భాగంలోనే అద్భుతంగా రివీల్ చేశారు. పార్ట్ 2లో ఇంకా భీకర పోరాటాల్ని తెరపై చూపించనున్నారు. మాఫియాని పీక్స్ లో చూపించబోతున్నారని హోంబలే సంస్థ తెలిపింది.