విన్నంతనే కంట కన్నీరు జలజలా రాలే పరిస్థితి. పగోడికి సైతం ఇలాంటి పరిస్థితి రాకూడదేమో. ఒకరి ప్రాణం కోసం పరితపించి.. వృత్తిధర్మాన్ని నెరవేర్చినందుకు అయినవాళ్లను పోగొట్టుకున్నవిషాదం ఒక ఎత్తు అయితే.. తన ప్రాణాలు పోవటం ఖాయమని అర్థం చేసుకొని.. తన చివరి క్షణాల్లో తన ఇద్దరు పిల్లల కోసం సదరు నర్సు పడిన తపన తెలిస్తే కంటనీరు ఆగదు. నెటిజన్లకు తీవ్ర భావోద్వేగానికి గురి చేస్తున్న ఈ వైనంలోకి వెళితే.. కేరళకు చెందిన 28 ఏళ్ల లినీ పుతుస్సెరి నర్సుగా పని చేస్తున్నారు.
కోజికోడ్లోని పరంబ్ర తాలూక్ ఆసుపత్రిలో ఆమె నర్సుగా బాధ్యతల్ని నిర్వర్తిస్తున్నారు. కేరళలో ఇటీవల నిపా వైరస్ విరుచుకుపడటం.. 12 మందికి పైగా కేరళవాసులు మరణించటం తెలిసిందే. ఈ క్రమంలో నిపా వైరస్ కు గురైన రోగులకు వైద్యసేవల్ని అందించిన లినీ సైతం ఈ మహమ్మారి వైరస్ బారిన పడ్డారు. మందు లేని ఈ వైరస్ బారిన పడిన ఆమెను ప్రత్యేక వార్డులో ఉంచారు. ఈ సందర్భంగా విదేశాల్లో ఉద్యోగం చేస్తున్న తన భర్తకు ఆమె ఆఖరి లేఖ రాశారు.
‘‘నేను చావుకు దగ్గర్లో ఉన్నాను. నిన్ను చూసే అవకాశం కూడా రాదేమో. మన ఇద్దరు పిల్లల బాధ్యత ఇకనుంచి పూర్తిగా నీదే. వారిని నువ్వు బాగా చూసుకోవాలి..’’ ప్రాణాంతక నిపా వైరస్ సోకిన రోగికి వైద్య సేవలు అందించి, అదే వైరస్ బారినపడిన ఓ నర్సు అంతిమ ఘడియల్లో తన భర్తకు రాసిన లేఖ ఇది.
లినీ భావోద్వేగపూరితమైన ఈ లేఖ నెటిజన్లను కన్నీరు పెట్టిస్తోంది. లినీకి ఐదు, రెండు ఏళ్లున్న ఇద్దరు కొడుకులు ఉన్నారు. భర్త సజీష్.. బహ్రెయిన్‌లో ఉంటుండడంతో పిల్లలను తానే చూసుకుంటోంది. కోజికోడ్‌లోని పరంబ్ర తాలూక్ ఆస్పత్రిలో పనిచేస్తున్న లినీ ఇటీవల నిపా వైర్‌సతో బాధపడుతున్న రోగికి చికిత్స చేసిన బృందంలో ఉంది. ప్రాణాంతక జాడ్యం ఆమెకూ సోకడంతో సోమవారం మృతిచెందింది. తాను బతికే అవకాశాల్లేవని తెలుసుకొని, ప్రాణానికి ప్రాణంగా చూసుకుంటున్న పిల్లల కోసం పరితపించింది.
తీవ్ర ఆవేదనతో చనిపోయే కొద్ది నిమిషాల ముందు ఐసీయూ నుంచే భర్త సజీష్ ను ఉద్దేశించి తన చివరి మాటలను కాగితంపై ఉంచింది. ‘‘మన పిల్లలను నీతో పాటు గల్ఫ్‌కు తీసుకెళ్లు. నా తండ్రి చిన్నప్పుడు మమల్ని వదిలేశాడు. దయచేసి ఆ పరిస్థితిని వారికి రానీయకు’’ అని లేఖలో భర్తను వేడుకుంది. రాకాసి నిపా వైరస్ సోకే ప్రమాదం ఉండడంతో లినీని కడసారి చూసే అవకాశాన్ని కుటుంబసభ్యులకు ఇవ్వలేదు.