శబరిమల అయ్యప్ప దర్శనాల సీజన్ ప్రారంభమైన నేపథ్యంలో, కేరళలో బ్రెయిన్ ఫీవర్ కలకలం రేపుతోంది. రాష్ట్రంలో ఇటీవల నమోదైన కేసులు భక్తుల్లో ఆందోళనను పెంచడంతో, ప్రభుత్వం ప్రత్యేక హెచ్చరికలు జారీ చేసింది. ముఖ్యంగా నీటి ద్వారా వ్యాపించే బ్రెయిన్-ఈటింగ్ అమీబా (Naegleria fowleri) ప్రమాదాన్ని దృష్టిలో ఉంచుకుని అధికారులు జాగ్రత్తలు పాటించాలని సూచిస్తున్నారు.
కేరళ ప్రభుత్వం తెలిపిన వివరాల ప్రకారం, నదులు, చెరువులు, తక్కువ లోతు ఉన్న నీటి ప్రాంతాల్లో స్నానం చేసే సమయంలో అమీబా ముక్కులోకి ప్రవేశించే అవకాశం ఉంది. ఇది మెదడులోకి చేరితే ప్రాణాలకు ముప్పు కలిగించే బ్రెయిన్ ఫీవర్‌కు దారి తీస్తుంది. వైద్య నిపుణులు ఇది అత్యంత అరుదైనదైనా, చాలా ప్రమాదకరమని చెబుతున్నారు.
అందువల్ల అయ్యప్ప భక్తులు దర్శనాలు చేసుకునే సమయంలో, ముఖ్యంగా పుణ్యస్నానాల్లో, నీరు ముక్కులోకి చేరకుండా జాగ్రత్తలు తీసుకోవాలి, అవసరమైతే ముక్కుకు క్లిప్లు ఉపయోగించాలని అధికారులు సూచించారు. చిన్నపిల్లలు, వృద్ధులు ఎక్కువ జాగ్రత్తలు పాటించడం అవసరమని తెలిపారు.
అలాగే, నీటిలో మునగడం, తలమునక చేయడం వంటి చర్యలను ఈ కాలంలో నివారించడమే మంచిదని ప్రభుత్వం సూచించింది. జ్వరం, తలనొప్పి, వాంతులు, మెడ గట్టిపడడం వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలని విజ్ఞప్తి చేసింది. శబరిమల యాత్ర శాంతియుతంగా, భద్రంగా సాగాలంటే ప్రతిఒక్కరూ ఈ సూచనలను పాటించాలని ప్రభుత్వం కోరుతోంది.
Also Read:రేవంత్ క్షమాపణ చెప్పాలి: కేటీఆర్

