ఇటీవల కురిసిన భారీ వర్షాలకు కేరళ రాష్ట్రం చిగురుటాకుల వణికిపోయింది. ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలతో దైవ భూమి అతలాకుతలామైంది. ఈ భారీ వర్షాలు, వరదల వల్ల ఎందరో ప్రజలు నిరాశ్రయులవ్వగా వేల కోట్ల ఆస్తినష్టం వాటిల్లింది. వర్షాల ధాటికి సర్వం కోల్పోయి, దిక్కుతోచని స్థితిలో ఉన్న ప్రజానికానికి అండగా తామున్నామంటూ సినీ, రాజకీయ, క్రీడా రంగానికి చెందిన పలువురు ప్రముఖులు భారీ విరాళాలు ఇచ్చి వారికి ధైర్యం చెబుతూ భరోసానిచ్చారు. ఇప్పుడిప్పుడే కొలుకుంటున్న కేరళను మరో భయం వెంటాడుతుంది.
వాతావరణ శాఖ సమాచారం మేరకు రానున్న శని, ఆదివారాల్లో కేరళకు భారీ నుంచి అతి భారీ వర్ష సూచన ఉన్నట్లు హెచ్చరించారు. ముఖ్యంగా ఇడుక్కి, పలక్కాడ్, త్రిసూర్ జిల్లాలకు అక్టోబర్ 7న రెడ్ అలర్ట్ ప్రకటించారు. తుపాను ప్రభావం హెచ్చరికలతో అప్రమత్తమైన సీఎం పినరయి విజయన్ ఉన్నతాధికారులతో బుధవారం సాయంత్రం అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు.
అక్టోబర్ 6వరకు సాధారణ వర్షాలు పడతాయని, అప్పటివరకూ ఎల్లో అలర్ట్ ప్రకటన వచ్చిటన్లు అధికారులు తెలిపారు. తీర ప్రాంతాల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరికలు జారీ చేశారు. అధికారులు చెప్పేవరకూ జాలర్లు సముద్రంలో వేటకు పల వేటకు వెళ్లవద్దని, రెడ్ అలర్ట్ ప్రకటించిన మూడు జిల్లాల్లో అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.
ఇటీవల కురిసిన వర్షాలకు దాదాపు పన్నెండు రోజులకు పైగానే కేరళ నీటిలో నానింది. రోడ్లు, కల్వర్లు, వంతెనలు ఇలా ఒక్కటేమిటి జలవిలయానికి అన్నీ ధ్వంసమయ్యాయి. తాజాగా మరోసారి ప్రకృతి విలయతాండవం చేస్తుందన్న వార్తలతో ప్రజలు ఉలిక్కిపడుతున్నారు.