దేశవ్యాప్తంగా ఢిల్లీ శివారులో జరుగుతున్న రైతుల ఆందోళనపైనే ఇప్పుడు చర్చ జరుగుతోంది. 18 రోజులుగా వేలాది మంది రైతులు రాజధాని శివారులోనే బైఠాయించారు. అక్కడే తింటున్నారు. అక్కడే నిద్రిస్తున్నారు. కేంద్రం తెచ్చిన మూడు వ్యవసాయ చట్టాలు రద్దు చేసే వరకు ఇక్కడి నుంచి కదిలేదని తెగేసి చెబుతున్నారు. రోజుకో రూపంలో నిరసన వ్యక్తం చేస్తూ కేంద్రంపై ఒత్తిడి తెస్తున్నారు. రైతుల ఆందోళనలకు విపక్షాలు, ప్రజా సంఘాలు, పలువురు సినీ ప్రముఖులు కూడా మద్దతు తెలుపుతున్నారు.
ఈ క్రమంలో కేంద్రం తెచ్చిన కొత్త సాగు చట్టాలకు వ్యతిరేకంగా దేశ వ్యాప్తంగా రైతులు చేపట్టిన ఒక్క రోజు నిరాహార దీక్షకు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ మద్దతు తెలిపారు. కేజ్రీవాల్ కూడా రైతులతో పాటు దీక్షలో పాల్గొన్నారు. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు దీక్ష కొనసాగింది. ఢిల్లీ సరిహద్దులోని సింఘు, టిక్రీ, ఘాజిపూర్‌తో సహా నిరసన ప్రాంతాల్లోనే అన్నదాతలు దీక్షకు దిగారు. ఢిల్లీ సరిహద్దులకు సమీప ప్రాంతాల రైతులు భారీ సంఖ్యలో చేరుకుని దీక్షలో పాల్గొన్నారు. దేశ వ్యాప్తంగా జిల్లా కేంద్రాల్లో నిరాహార దీక్షలు చేపట్టాలని అన్నదాతలకు రైతు సంఘాల నేతలు పిలుపునిచ్చారు. కేంద్రం దిగొచ్చే వరకు తమ ఆందోళనలు కొనసాగుతాయని రైతులు స్పష్టం చేశారు.
నిరాహార దీక్ష ముగిసిన అనంతరం కేజ్రీవాల్ మాట్లాడుతూ.. పంట పొలాల్లో ఉండే రైతులు.. ఎముకలు కొరికే చలిలో దీక్షలు, నిరసనలు చేయడం బాధాకరమైన విషయమని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం రైతులు ప్రమాదంలో ఉన్నారని తెలిపారు. కేంద్ర చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళనకు దిగిన అన్నదాతలకు అండగా ఆర్మీ, లాయర్లు, నటులు, డాక్టర్లతో పాటు పలువురు ప్రముఖులు నిలవడం సంతోషాన్ని ఇస్తుందని సీఎం అన్నారు.