తెలంగాణలో అటవీ ప్రాంతాన్ని 33 శాతానికి విస్తరించాలన్న లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన హరితహారం కార్యక్రమం కొత్త పుంతలు తొక్కుతోంది. వర్షాకాలంలో వినూత్నపద్ధతిలో ఈ హరితహారం కార్యక్రమాన్ని అమలుచేసేందుకు అటవీశాఖ కార్యక్రమాలు రూపొందిస్తోంది. ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో పచ్చదనాన్ని పెంచేందుకు సీడ్ బాంబింగ్(సీడ్ బాల్) కార్యక్రమాన్ని చేపట్టింది.
ఇందులో భాగంగా కీసర రిజర్వు ఫారెస్ట్ లో సీడ్ బాల్ ద్వారా లక్ష మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు ఎంపీ సంతోష్ కుమార్. ఇందులో భాగంగా మేడ్చల్ కలెక్టరేట్ బీ-బ్లాక్ ముందున్న ఖాళీ ప్రదేశంలో లక్షలు మొక్కలు నాటే బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ప్యారా రైడింగ్ మిషన్ ద్వారా సీడ్‌బాల్ ట్రయల్ రన్‌ను కలెక్టర్ వాసం వెంకటేశ్వర్లు ప్రారంభించారు. స్వయంగా కలెక్టర్ వెంకటేశ్వర్లే ప్యారా రైడింగ్ ద్వారా విత్తనాలు చల్లారు.త్వరలోనే ఎంపీ సంతోష్ కుమార్ లక్ష సీడ్ బాల్స్ చల్లే కార్యక్రమాన్ని ప్రారంభిస్తారని ఆయన తెలిపారు.
నాణ్యమైన మట్టిని తీసుకుని దానిలో సేంద్రియ ఎరువులు కలిపి ఓ మిశ్రమంగా ముందు మట్టిని తయారు చేసుకుంటారు..అదే సీడ్ బాల్. దానిని చిన్నచిన్న బంతుల్లా తయా రుచేసి అందులో మేలురకమైన విత్తనాలు ఉంచుతారు. వాటిని అడవుల్లో వెదజల్లుతారు. ఆ విత్తన బందులు వర్షాలు పడిన తర్వాత నాని మట్టి కరిగిపోయి అందులో ఉన్న విత్తనం బయట పడి భూమిలోకి పోయి మొక్కలా మొలకెత్తుతుంది. ఈ సీడ్ బాల్స్ తయారుచేయడానికి అయ్యే ఖర్చు చాలా తక్కువ. కర్నాటక రాష్ట్రంలోని బెంగళూరులో కొన్ని ఏజెన్సీలు ఈ పద్ధతిని విజయవంతంగా అమలు చేస్తున్నాయి.