జాతీయ అవార్డు గ్రహిత నటి కీర్తి సురేష్‌ను యూనిసెఫ్ ఇండియా (UNICEF India) సెలబ్రిటీ అడ్వకేట్‌గా నియమించినట్లు ఐక్యరాజ్యసమితి సంస్థ ప్రకటించింది. తమిళం, తెలుగు, మలయాళ చిత్రాలలో విమర్శకుల ప్రశంసలు పొందిన పాత్రలకు ప్రసిద్ధి చెందిన కీర్తి సురేష్, యూనిసెఫ్ తరపున బలహీన వర్గాల పిల్లల కోసం కృషి చేయనున్న ప్రముఖుల బృందంలో చేరారు. పిల్లల సంరక్షణ కోసం యూనిసెఫ్ చేపడుతున్న ప్రయత్నాలకు ఆమె మద్దతు ఇస్తారని సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది.
తన కొత్త పాత్రలో, ఈ నటి తన వేదికను ఉపయోగించుకుని మానసిక ఆరోగ్యం, విద్య, లింగ సమానత్వం వంటి కీలక అంశాలపై అవగాహన పెంచనున్నారు. కీర్తి సురేష్‌తో భాగస్వామ్యం కావడం యూనిసెఫ్ ఇండియాకు సంతోషంగా ఉంది. ప్రేక్షకులతో ఆమెకున్న బలమైన బంధం పిల్లల హక్కులు, శ్రేయస్సు కోసం వాదించడానికి శక్తివంతమైన వేదికగా ఉపయోగపడుతుంది అని యూనిసెఫ్ ఇండియా ప్రతినిధి సింథియా మెక్‌కాఫ్రే అన్నారు.
ఈ బాధ్యతను స్వీకరించడం తనకెంతో గౌరవంగా ఉందని కీర్తి సురేష్ ఆనందం వ్యక్తం చేశారు. పిల్లలు మన గొప్ప బాధ్యత, మన గొప్ప ఆశ. ప్రేమతో కూడిన శ్రద్ధ, సంరక్షణ పిల్లలు సంతోషకరమైన, ఆరోగ్యకరమైన జీవితాలను గడపడానికి అవసరమైన సామాజిక, భావోద్వేగ నైపుణ్యాలను అభివృద్ధి చేయడానికి పునాదిని నిర్మిస్తుంది. ప్రతి బిడ్డ, వారి నేపథ్యం లేదా సామర్థ్యంతో సంబంధం లేకుండా వృద్ధి చెందడానికి అవగాహన పెంచడానికి, చర్యలను ప్రేరేపించడానికి యూనిసెఫ్ ఇండియాతో చేతులు కలపడం నాకు గౌరవంగా ఉంది అని ఆమె అన్నారు.
Also Read:BB9:ప్రేక్షకుల నిరాశ!

