కేంద్రంలో హంగ్ వస్తే.. కేసీఆర్ కింగ్ ఢిల్లీలో ఫ్రంట్ కార్యాలయం..

144

దేశ రాజకీయాల్లో గుణాత్మక మార్పు తీసుకురావడానికి ఫెడరల్ ఫ్రంట్ ద్వారా ప్రయత్నం చేస్తున్న తెలంగాణ సీఎం కేసీఆర్ మళ్ళీ ఆదిశగా అడుగులు వేస్తున్నారు. దేశంలో మోడీ, రాహుల్ గాంధీలకు ప్రత్యామ్నాయంగా ఫెడరల్ ఫ్రంట్ ఉండాలని భావిస్తున్న కేసీఆర్ నిదానంగా పావులు కదుపుతున్నారు. ఫెడరల్ ఫ్రంట్ దిశగా మళ్లీ చర్చలు మొదలు పెట్టిన తెలంగాణ సీఎం, టీఆర్‌ఎస్ చీఫ్ కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ఇటీవల కేరళలో ఆ రాష్ట్ర సీఎం పినరయి విజయన్‌తో భేటీ అయ్యారు. చెన్నై వెళ్లి స్టాలిన్ ను కలవాలని, ఆ తర్వాత కర్ణాటక సీఎం కుమారస్వామితో భేటీ కావాలని కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ కోసం వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు.

KCR

ఎన్నికల షెడ్యూల్‌కు ముందునుంచే వ్యూహాత్మకంగా ప్రణాళిక రూపోందించారు కేసీఆర్‌. ఈ నేపథ్యంలో గతేడాది బెంగాల్ సీఎం మమతా, యూపీ మాజీ సీఎం మాయావతి, ఎస్పీ అధినేత అఖిలేశ్ యాదవ్, ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్, మాజీ ప్రధాని దేవెగౌడలతో ఆయన భేటీ అయి చర్చించారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో దేశ అవసరాలు, రాజకీయ మార్పులు, ప్రజల ఆకాంక్షపై సమాలోచనలు జరిపారు. జాతి నిర్మాణానికి అనుసరించాల్సిన విధానాలు, దేశవ్యాప్త వనరుల సద్వినియోగం, దాని ద్వారా సాధించే ఆర్థిక పురోగతి, వ్యవసాయ రంగం, రైతు సంక్షేమం, గ్రామీణ సంపద సృష్టించే అంశాలపై లోతుగా చర్చించారు.

ప్రస్తుతం దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్నాయి. ఇక అన్ని దశలు ఈనెల 19న ముగియనున్నాయి. 23న ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. కాంగ్రెస్‌, బీజేపీకి సొంతంగా మెజారిటీ స్థానాలు వచ్చే అవకాశం లేదని, మూడో ఫ్రంట్‌ లేదా బీజేపీయేతర పక్షాల కూటమి అధికారంలోకి వచ్చే అవకాశం ఉందన్న ప్రచారం సాగుతోంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్‌,బీజేపీ ప్రత్యామ్నాయంగా ఫెడరల్ ఫ్రంట్ ద్వారా కేసీఆర్‌ కేంద్రంలో చక్రం తిప్పాలని భావిస్తున్నారు. నిజంగానే బీజేపీ, కాంగ్రెస్‌లకు అనుకున్న మెజారిటీ రాకపోతే ప్రాంతీయ పార్టీలతో పొత్తు తప్పనిసరి అవుతుంది. ఆలోగా ప్రాంతీయ పార్టీలన్నింటినీ కలిపి ఫ్రంట్ ఏర్పాటు చేసి, ముందుకుసాగితే ఫ్రంట్‌కు నాయకత్వం వహించిన కేసీఆర్ కింగ్ అవుతారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అంతేకాదు అందుకు తగిన విధంగా కేసీఆర్‌ త్వరలోనే ఢిల్లీలో ఫెడరల్ ఫ్రంట్ సంబంధించిన జాతీయ కార్యాలయాన్ని ప్రారంభించాలనుకుంటున్నట్లు సమాచారం.