తెలుగు రాష్ట్రాల సీఎంల ఢిల్లీ పర్యటన రద్దైనట్లు సమాచారం. ఢిల్లీలో రాత్రి 7 గంటలకు జరిగే నరేంద్ర మోడీ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరుకావాల్సిందిగా ఆహ్వానాలు అందాయి. దీంతో జగన్, కేసీఆర్ ఇద్దరూ కలిసి ప్రత్యేక విమానంలో ఢిల్లీ వెళ్లాలని భావించారు. అయితే మోడీ ప్రమాణ స్వీకారం నేపథ్యంలో భద్రతా కారణాల దృష్ట్యా మధ్యిహ్నం మూడు గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు షెడ్యూల్‌లో లేని ప్రత్యేక విమానాల ల్యాండింగ్ అనుమతులను పౌరవిమానయాన శాఖ రద్దు చేసింది. దీంతో కేసీఆర్,జగన్… మోడీ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి గైర్హాజరు కావాల్సిన పరిస్థితి ఏర్పడింది.
జవహర్‌లాల్ నెహ్రూ, ఇందిరా గాంధీ తర్వాత పూర్తిస్థాయి మెజార్టీతో రెండోసారి ప్రధానమంత్రి అవుతోన్న తొలి వ్యక్తిగా నరేంద్ర మోడీ కావడం విశేషం. రాత్రి 7 గంటలకు జరిగే ఈ కార్యక్రమానికి వివిధ దేశాల అధినేతలతో పాటు వివిధ రాష్ట్రాల సీఎంలు హాజరుకానున్నారు. ఇక మోడీ కేబినెట్‌లో 50 నుంచి 60 మంది వరకు మంత్రులు ఉంటారని తెలుస్తోంది. అమిత్ షా మోడీ కేబినెట్‌లో చేరనుండగా రాజ్‌నాథ్ సింగ్, సుష్మా స్వరాజ్‌లను మంత్రులుగా కొనసాగించనున్నారు మోడీ.
మోడీ ఆహ్వానం మేరకు ప్రమాణ స్వీకార కార్యక్రమానికి కాంగ్రెస్ నేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కూడా రానున్నారు.