ప్రేమతో దేనినైనా జయించవచ్చని సీఎం కేసీఆర్ అన్నారు. చిన్న చిన్న పంచాయతీలను పక్కన బెట్టి అందరి కోసం అందరం నిలబడదామని ఎర్రవల్లి,నర్సన్నపేట గ్రామాల ప్రజలకు సీఎం పిలుపునిచ్చారు. మెదక్ జిల్లాలోని దత్తత గ్రామమైన ఎర్రవల్లిలో రెండు గ్రామాల అభివృద్ధిపై ప్రజలతో సమావేశం నిర్వహించిన సీఎం ఎర్రవల్లి,నర్సన్నపేట…తెలంగాణకు ఆదర్శం కావాలన్నారు.
వివిధ కారణాల వల్ల డబుల్ బెడ్ ఇళ్ల నిర్మాణంలో ఆలస్యం జరిగిందని….ఆలస్యమైన అన్ని పనులు పూర్తిచేసుకున్న తర్వాత ఇళ్లలోకి వెళ్దామన్నారు కేసీఆర్. స్ధానికంగా ఉండే వనరులు వాడుకుని ఎర్రవల్లి,నర్సన్నపేట గ్రామాలు ఆదర్శంగా మారుతున్నాయని తెలిపారు. ప్రభుత్వ ఖర్చుతోనే రెండు గ్రామాల్లో బోర్లు వేస్తామని తెలిపారు. రెండు గ్రామాల ప్రజలు కలిసి నడిస్తే అభివృద్ధి జరుగుతుందని తెలిపారు.వ్యవసాయాన్ని పద్ధతి ప్రకారం చేసుకుంటూ.. పని విభజన చేసుకుని పంటలు పండించుకోవాలని సూచించారు.
దేశంలో ఎల్‌నినో పరిస్థితి పోయి…లానినో పరిస్థితి వచ్చిందని తెలిపారు.లానినోతో ఇకపై బ్రహ్మాండమైన వర్షాలు పడతాయని తెలిపారు. వ్యవసాయ గ్రామమైన అంకాపూర్ అభివృద్ధి చెందిందని…మహిళలే ఇంటి పెత్తనాన్ని చూసుకుంటు మంచి ఫలితాలు సాధించారని…ఈ రెండు గ్రామాల్లో కూడా అదే పద్దతిని పాటిద్దామని సూచించారు. డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణ పనులను వేగవంతం చేయాలని అధికారులకు ఆదేశాలు జారీచేశారు. ఎర్రవల్లి గ్రామంలో నిర్మించిన మాదిరిగానే నర్సన్నపేటలో కూడా కమ్యూనిటీ హాల్ నిర్మించాలన్నారు.
రెండు సంవత్సరాల్లో గోదావరి జలాలు రెండు గ్రామాలకు వస్తాయని తెలిపారు. సంపులకు బోర్లు అనుసంధానం చేస్తామని తెలిపారు. మల్లన్న సాగర్ పంచాయతీ ముగిసిందని….భగవంతుని దయతో వర్షాలు బాగా పడటంతో గ్రౌండ్ వాటర్ లెవల్ పెరిగిందని తెలిపారు. పద్దతి ప్రకారం వ్యవసాయం చేస్తే మంచిఫలితాలు సాధిస్తామని…అద్భుత ఫలితాలు సాధించవచ్చని తెలిపారు.