అసెంబ్లీ ఎన్నికల్లో అఖండ విజయం సాధించిన టీఆర్‌ఎస్ అదే స్ఫూర్తితో ఇప్పుడు లోక్‌సభ ఎన్నికల విజయం కోసం ప్రణాళికలు రూపొందిస్తుంది. ఈ నేపథ్యంలో గులాబి దళం భారీ సభలు ఏర్పాటు చేస్తూ దూసుకుపోతుంది. ఇక గత కొద్ది రోజులుగా టీఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పలు జిల్లాలో ఎన్నికల ప్రచారం సభల్లో పాల్గొంటున్నారు.
అయితే ఇప్పటి వరకు సీఎం కేసీఆర్ ఏ సభకు హాజరుకాలేదు. కాగా ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు నేటి నుండి ప్రచార సభల్లో పాల్గొననున్నారు. ఈ నేపథ్యంలో నేడు సీఎం కేసీఆర్ శంఖారావం పూరించనున్నారు. తెలంగాణలోని పదహారు లోక్‌సభ నియోజకవర్గాల్లో గులాబీ జెండా ఎగరేయటమే ధేయ్యంగా నిర్వహించే ఎన్నికల ప్రచార సభలను కరీంనగర్ నుంచి ప్రారంభించనున్నారు.
18వ తేదీ నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభంకానుండగా అంతకుముందురోజు అంటే నేడు (ఆదివారం) రెండు లక్షలమందితో కరీంనగర్‌లోని ఈ భారీ బహిరంగ సభ జరగనుంది. ఈ సభ స్పోర్ట్స్ స్కూల్ మైదానంలో ఏర్పాటు చేస్తున్నారు. ఈ సభతో టీఆర్‌ఎస్ పార్టీ శ్రేణుల్లో నూతన ఉత్సహాన్ని నింపుతుందని పార్టీవర్గాలు విశ్వాసంతో ఉన్నాయి. సీఎం కేసీఆర్ తెలంగాణ ఉద్యమం మొదలుకొని ఏ కార్యక్రమం అయినా కరీంనగర్ నుంచే ప్రారంభిస్తుంటారు.ఇప్పటికే సభకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.