కొంగరకలాన్ లో జరిగిన ప్రగతి నివేదన సభలో మాట్లాడిన సీఎం కేసీఆర్ తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాల గురించి ప్రస్తావించారు. తెలంగాణలో కళ్యాణలక్ష్మి, రైతు బంధు, రైతు భీమా పథకాల గురించి కూడా ప్రస్తావించారు.
తెలంగాణ రైతన్న ఆకలితో అలమటించకూడదంటూ.. ఎప్పటికైనా ..రైతు ధనవంతుడవ్వాలన్న ఆశయంతో.. వ్యవసాయాన్ని నమ్ముకున్న రైతన్నకు వెన్నుదన్నుగా ఉండేందుకే రైతుబంధు పథకాన్ని ప్రవేశపెట్టామని తెలిపారు. రైతుబందు పథకం పై వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని, తెలంగాణ ప్రభుత్వం ఉన్నంత వరకి ఈ పథకం ఉంటుందని వెల్లడించారు.
కాగా..తెలంగాణ రాష్ట్రంలో 465 సంక్షేమ పథకాలను చేపట్టామని, ఈ క్రమంలోనే పేదగుండెల ఆవేదన తీర్చాలనే ఆలోచననుంచి పుట్టిందే కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను ప్రవేశపెట్టామని, కళ్యాణలక్ష్మి వచ్చిన తర్వాత బాల్య వివాహాలు తగ్గాయని వెల్లడించారు.
అంతేకాకుండా దురదృష్టవశాత్తు రైతు చనిపోతే అతని కుటుంబం రోడ్డున పడొద్దని రైతుబీమా పథకం అమలు చేశామని కేసీఆర్ తెలిపారు. ఇప్పటి వరకు 365 మంది రైతులు చనిపోతే వారి కుటుంబాలకు రూ. 5 లక్షల చొప్పున బీమా సొమ్ము అందించామని చెప్పారు.