సిద్దిపేట ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం కేసీఆర్ పాల్గొని మాట్లాడారు. సీఎం మాట్లాడుతూ.. సిద్దిపేట పేరులోనే ఎదో బలం ఉంది.. ఇది మామూలు పేట కాదు.. తెలంగాణ సిద్దింప చేసిన గడ్డ. సిద్దిపేట లేకుంటే కేసీఆర్ లేడు.. కేసీఆర్ లేకుంటే తెలంగాణ లేదు. నేను సిద్దిపేట విడిచినా నా అంత నాయకుడు హరీశ్ రావును అప్పగించాను. సిద్దిపేట అంటే నాకు ప్రాణం. నాకెన్నో కళలు ఉండే.. భగవంతుని దయ వల్ల అవి చాలా వరకు నెరవేరాయి. సిద్దిపేట జిల్లా చేయాలని అప్పటి సీఎం ఎన్టీఆర్‌ను కోరాను. అప్పుడు అనేక కారణాలతో జిల్లా ఏర్పాటు కాలేదని సీఎం అన్నారు. తెలంగాణ వచ్చాక జిల్లా కలను నిజం చేసుకున్నాం. ఈ రోజు రాష్ట్రంలో కరెంట్ సమస్య లేదు.. అవసరం అయతే ఇతరులకు ఇచ్చే స్థాయికి ఎదిగాం. మంచి నీటి గోస తీర్చుకున్నాం.. సిద్దిపేట తాగునీటితోనే ఈ రోజు రాష్ట్రానికి మిషన్ భగీరథ. ఈ కీర్తి సిద్దిపేట గడ్డదే అని సీఎం కొనియాడారు.
రంగనాయక స్వామి దయ వల్ల, కాకేశ్వర స్వామి దయ వల్ల సాగునీటి గోస తీరింది. రంగనాయకసాగర్ గొప్ప పర్యటక ప్రాంతం కాబోతున్నది.. 68 ఎకరాల జాగా ఉన్నది. అంతర్జాతీయ స్థాయి పర్యటక కేంద్రంగా రూపు దిద్దుకోవాలి. ఇందుకు 100 కోట్లు మంజూరు చేస్తున్న.. చాలా గొప్పగా అభివృద్ధి జరగాలి. మల్లన్నసాగర్ నుంచి ఇరుకోడ్ లిఫ్ట్ ఇరిగేషన్ కు 80 కోట్లు మంజూరు. రాజీవ్ రహదారి టూ రాజీవ్ రహదారి 75 కి.మీ. రింగ్ రోడ్డుకు 160 కోట్లు మంజూరు. సిద్దిపేట – ఇల్లంతకుంట వరకు 25 కి.మీ. నాలుగు వరసల రహదారి మంజూరు. పట్టణానికి మరో వెయ్యి డబుల్ బెడ్రోమ్ ఇల్లు మంజూరు చేశామన్నారు.
ఇండియాకు రోల్ మోడల్ గా రెండు పడక గదుల ఇండ్లు ఉన్నాయి. చాలా అద్భుతంగా కట్టారు.. నా కల నెరవేరేనా ఈ ఇండ్లు ఉన్నాయి. 3వ టౌన్ పోలీస్ స్టేషన్ కూడా మంజూరు చేస్తున్న..కేసీఆర్ నగర్‌లో బస్తి దవాఖాన మంజూరు చేస్తున్నాం. ఇక కోమటి చెరువు కోటి అందాల చేరువుగా అద్భుతంగా మారింది. దీని అభివృద్ధి కి మరో 25 కోట్లు మంజూరు చేస్తున్నాం. సిద్దిపేట పట్టణానికి 50 కోట్లతో 2000 మంది కూర్చునేలా ఆడిటోరియం నిర్మిస్తాం. సిద్దిపేట ఇంకా అద్భుతంగా పెరుగుతది.. ఇంటిగ్రేటెడ్ వెజ్ అండ్ నాన్ వెజ్ మార్కెట్ 25 కోట్లతో నిర్మాణం చేపట్టాం.హైదరాబాద్ నగరాన్ని తలపించేలా సిద్దిపేట ఎదుగుతది. రాష్ట్రానికి మరో ఎయిర్ పోర్ట్ అవసరమైతే అది ఇటు వైపే వస్తది అని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు.