అందుకే టీడీపీతో పొత్తు పెట్టుకున్నాం!

8
- Advertisement -

తెలంగాణ భవన్‌లో జరిగిన బీఆర్ఎస్ జనరల్ బాడీ సమావేశంలో పార్టీ అధినేత కేసీఆర్ సుమారు రెండు గంటల పాటు సుదీర్ఘ ప్రసంగం చేశారు. ప్రస్తుత రాజకీయ పరిణామాలు, ప్రభుత్వ వైఫల్యాలు మరియు పార్టీ పునర్నిర్మాణంపై ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కాంగ్రెస్ మరియు బీజేపీ ఎంపీల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ అస్తిత్వాన్ని కించపరిచేలా మాట్లాడితే చూస్తూ ఊరుకుంటున్నారని మండిపడ్డారు.

బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య తెలంగాణను అవమానించేలా మాట్లాడితే, రాష్ట్రానికి చెందిన కాంగ్రెస్, బీజేపీ ఎంపీలు ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్నించారు. “తెలంగాణ పౌరుషం లేదా వాళ్లకు? అదే బీఆర్ఎస్ ఎంపీలు ఉంటే పార్లమెంటును రణరంగం చేసేవాళ్లం” అని ధీమా వ్యక్తం చేశారు.2009లో చంద్రబాబుతో “జై తెలంగాణ” అనిపించేందుకే నాడు టీడీపీతో పొత్తు పెట్టుకున్నామని పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు.

రాష్ట్ర ప్రభుత్వంపై కేసీఆర్ విమర్శల వర్షం కురిపించారు. ప్రభుత్వం ధాన్యం కొనలేని చేతకాని స్థితిలో ఉందని, రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.పక్క రాష్ట్రాల ప్రజలు సైతం హైదరాబాద్‌లోని అతిపెద్ద అంబేద్కర్ విగ్రహాన్ని చూడాలని వస్తుంటే, ప్రభుత్వం గేట్లు తీయడం లేదని విమర్శించారు.
గతంలో సంక్షేమంలో నంబర్ వన్‌గా ఉన్న రాష్ట్రం, నేడు తిరోగమనంలో ఉందని ఎద్దేవా చేశారు.

ఓటమి నుంచి పాఠాలు నేర్చుకుంటూ పార్టీని సంస్థాగతంగా ప్రక్షాళన చేయాలని కేసీఆర్ నిర్ణయించారు.గ్రామ, మండల, పట్టణ మరియు జిల్లా స్థాయి కమిటీలన్నింటినీ రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు..60 లక్షల సభ్యత్వం ఉన్నా ఎందుకు ఓడిపోయామో సమీక్షించుకోవాలి. మనకు సంఖ్య (రాశి) కంటే నాణ్యత (వాసి) ముఖ్యం అని స్పష్టం చేశారు.

ప్రతి నియోజకవర్గంలో 200 మందిని ఎంపిక చేసి వారికి ప్రత్యేక శిక్షణా తరగతులు నిర్వహించాలని కేటీఆర్‌ను ఆదేశించారు. తమ హయాంలో సింగరేణి ఉద్యోగులకు లాభాల్లో వాటా, బోనస్ మరియు డిపెండెంట్ ఉద్యోగాలు ఇచ్చిన విషయాన్ని గుర్తు చేస్తూ, కార్మికుల పక్షాన బీఆర్ఎస్ ఎప్పుడూ ఉంటుందని హామీ ఇచ్చారు.

చివరగా, పార్టీ భవిష్యత్తు కార్యాచరణపై నేతలందరి అభిప్రాయాలను అడిగి తెలుసుకున్న కేసీఆర్, త్వరలోనే సభ్యత్వ నమోదు ప్రక్రియను కొత్త ఉత్సాహంతో ప్రారంభించాలని పిలుపునిచ్చారు.

- Advertisement -