తెలంగాణ పోలీస్ శాఖలో పనిచేస్తున్న సిబ్బందికి డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (DGP) బి. శివధర్ రెడ్డి గుడ్ న్యూస్ చెప్పారు. విధి నిర్వహణలో నిరంతరం ఒత్తిడికి లోనయ్యే పోలీసుల సంక్షేమాన్ని కాంక్షిస్తూ ఆయన కీలక నిర్ణయం తీసుకున్నారు.
పోలీసు అధికారులు, సిబ్బంది తమ కుటుంబ సభ్యులతో నాణ్యమైన సమయాన్ని గడపాలనే ఉద్దేశంతో డీజీపీ కొత్త ఉత్తర్వులను జారీ చేశారు. ప్రతి పోలీసు ఉద్యోగి తన పుట్టినరోజు నాడు ప్రత్యేక సెలవు తీసుకోవచ్చు. పెళ్లి రోజున కూడా సిబ్బందికి సెలవు మంజూరు చేయబడుతుంది. శాంతిభద్రతల పరిరక్షణలో పోలీసులు పగలు, రాత్రి అనే తేడా లేకుండా శ్రమిస్తుంటారు. పండుగలు, పబ్బాలు కూడా పక్కన పెట్టి విధుల్లో ఉండటం వల్ల కుటుంబానికి దూరమవుతున్నారనే భావన వారిలో ఉంది.
సిబ్బంది మానసిక ఉల్లాసం, కుటుంబ సభ్యులతో సంతోషంగా గడిపే అవకాశం కల్పించడం ద్వారా వారి పనితీరు మెరుగుపడుతుందని ఈ నిర్ణయం తీసుకున్నాం అని డీజీపీ శివధర్ రెడ్డి తెలిపారు. కానిస్టేబుల్ నుంచి ఉన్నతాధికారుల వరకు అందరూ ఈ సెలవులకు అర్హులు. ఈ నిర్ణయం పట్ల పోలీస్ అసోసియేషన్లు మరియు సిబ్బంది హర్షం వ్యక్తం చేస్తున్నారు. తమ వ్యక్తిగత జీవితంలోని ముఖ్యమైన రోజులను కుటుంబంతో జరుపుకునే వీలు కలగడం పట్ల వారు డీజీపీకి కృతజ్ఞతలు తెలుపుతున్నారు.
Also Read:అందుకే టీడీపీతో పొత్తు పెట్టుకున్నాం!


