ఒంటరి స్త్రీలకు జీవనభృతి….

233
KCR Rs. 1000 Pension Scheme to Single woman
- Advertisement -

తెలంగాణ రాష్ట్రంలో ఒంటరి జీవితం గడుపుతున్న మహిళలకు జీవనభృతి కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినట్లు ముఖ్యమంత్రి కేసీఆర్‌తెలిపారు. అసెంబ్లీ వేదికగా ఈ విషయాన్ని సీఎం ప్రకటించారు. దేశంలో ఎక్కడా లేని విధంగా అమలవుతున్న కల్యాణలక్ష్మీ, షాదీముబారక్ వంటి పథకాల్లాగే మానవీయ కోణంలో మరో పథకాన్ని ప్రవేశపెడుతున్నామని చెప్పారు. శాసనసభలో ఈ పథకాన్ని ప్రకటించడం సంతోషంగా ఉందన్నారు.

KCR Rs. 1000 Pension Scheme to Single woman

రాష్ట్రంలో ఒంటరిగా జీవితం గడుపుతున్న మహిళలు పడుతున్న కష్టాలను తీర్చేందుకు ఆర్థిక సహాయం అవసరమని గత కొంతకాలంగా తమ దృష్టికి వస్తుందన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని అంచనా వేసుకుని, సాధ్యసాధ్యాలను గుర్తించిన తర్వాత నిర్ణయం తీసుకోవాలని అనుకున్నామని తెలిపారు. రాష్ట్రంలో దాదాపు 2 లక్షల నుంచి 3 లక్షల మంది ఒంటరి స్త్రీలు ఉన్నట్లు అంచనా. వారికి జీవన భద్రత కల్పించాలని నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. వచ్చే మార్చి నెలలో ప్రవేశపెట్టే బడ్జెట్‌లో నిధులు కేటాయిస్తామన్నారు. ఒంటరి స్త్రీలకు రూ. 1000 జీవనభృతి పథకం వచ్చే ఆర్థిక సంవత్సరం అంటే ఏప్రిల్‌1,2017 నుంచి అమలవుతుందన్నారు.

KCR Rs. 1000 Pension Scheme to Single woman

జిల్లా కలెక్టర్లందరూ ఒంటరి మహిళల వివరాలు నమోదు చేసే కార్యక్రమం చేపట్టాలన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఒంటరి స్త్రీలంతా తమ పేర్లను ప్రభుత్వం వద్ద నమోదు చేసుకోవాలని కోరారు. ఈ విషయంలో శాసన సభ్యులందరూ ప్రత్యేక శ్రద్ధ వహించి అసలైన ఒంటరి స్త్రీలకు లబ్ధి చేకూరేలా జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. ఒంటరి స్త్రీల పేర్లు, వివరాలు నమోదు చేసే విషయంలో శాసనసభ్యులు కూడా బాధ్యత వహించాలని సీఎం కేసీఆర్‌ అన్నారు.

- Advertisement -