మిషన్ భగీరథ దేశానికే అదర్శం.. అన్ని రాష్ట్రాలు తెలంగాణ వైపే చూస్తున్నాయని సీఎం కేసీఆర్ అన్నారు. మిషన్ భగీరథ పనుల పురోగతిపై ప్రగతి భవన్‌లో ప్రజాప్రతినిధులు, అధికారులతో సమీక్ష నిర్వహించిన సీఎం రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగుందన్నారు. చాలా రాష్ట్రాలు మిషన్ భగీరథ వంటి పథకాలకు సిద్ధపడుతున్నాయని తెలిపారు. వచ్చే ఎన్నికల నాటికి అన్ని గ్రామాలకు మంచినీరు ఇవ్వకపోతే ఓట్ల అడగబోమని ప్రకటించిన విషయాన్ని అధికారులకు సీఎం గుర్తు చేశారు. 2017 డిసెంబర్ నాటికి అన్ని పనులు పూర్తి చేయాలనే లక్ష్యంతో అందరూ కష్టపడాలని కోరారు. డిసెంబర్‌ను లక్ష్యంగా పెట్టుకున్నప్పటికీ.. జూన్‌లోగా పనులు పూర్తి చేయాలని ఆదేశించారు.
అదేవిధంగా వృద్ధిరేటు అధికంగా ఉన్న రాష్ట్రాల్లో తెలంగాణ ఉందన్నారు. ఈ పరిస్థితిని ఉపయోగించుకుని అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలని అధికారులకు సూచించారు. కాంట్రాక్టర్లు ప్రభుత్వ ఉద్దేశాలను అర్థం చేసుకుని సకాలంలో పనులు పూర్తి చేయాలని చెప్పారు. ఎక్కడ ఏ సమస్య వచ్చినా జిల్లాస్థాయిలో చర్చించాలని ఆదేశించారు. సమస్యలపై సీఎం కార్యాలయం కూడా వెంటనే స్పందిస్తుందన్నారు.
ఇక పనులు పూర్తైన వివరాలను సీఎంకు అధికారులు తెలిపారు. 2017 మార్చి నాటికి ఇన్‌టేక్‌వెల్ పనులు, జూన్ నాటికి వాటర్ ట్రీట్‌మెంట్ ప్లాంట్లు పూర్తవుతాయని అధికారులు చెప్పారు. 2017 మార్చి నాటికి 3,811 గ్రామాలకు(9.79 లక్షల ఇండ్లు) నల్లా నీరు, డిసెంబర్ నాటికి మరో 20,366 గ్రామాలకు(42.38 లక్షల ఇండ్లు) నీరందిస్తామన్నారు.