నల్లబెల్లికి కేసీఆర్..పెద్ది కుటుంబానికి భరోసా

3
- Advertisement -

నర్సంపేట నియోజకవర్గం నల్లబెల్లిలో బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు పర్యటించారు. ఇటీవల కన్నుమూసిన తెలంగాణ ఉద్యమ నాయకుడు, నర్సంపేట మాజీ ఎమ్మెల్యే స్వర్గీయ పెద్ది సుదర్శన్ రెడ్డి నివాసానికి వెళ్లిన కేసీఆర్…..పెద్ది సుదర్శన్ రెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం శోకసంద్రంలో ఉన్న కుటుంబ సభ్యులను పరామర్శించి, ఓదార్చి, పార్టీ అన్ని వేళలా అండగా ఉంటుందని కొండంత భరోసానిచ్చారు.

ఈ సందర్భంగా దివంగత నేత పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబ సంక్షేమం కోసం కేసీఆర్ రూ. 2.25 కోట్ల భారీ ఆర్థికసాయాన్ని ప్రకటించి, చెక్కుల రూపంలో అందించారు. సుదర్శన్ రెడ్డి ఇద్దరు పిల్లల భవిష్యత్తు, చదువుల నిమిత్తం రూ. 2 కోట్లు, అలాగే ఆయన వృద్ధురాలైన తల్లి బాగోగుల కోసం రూ. 25 లక్షల చెక్‌ను కుటుంబ సభ్యులకు నేరుగా అందజేశారు. కేసీఆర్ తో పాటు పార్టీ సీనియర్ నేతలు, పలువురు ప్రజాప్రతినిధులు ఆయన వెంట ఉన్నారు.

తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించి, నియోజకవర్గ ప్రజలకు సేవ చేసిన పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబాన్ని పరామర్శించేందుకు కేసీఆర్ రోడ్డు మార్గాన నర్సంపేటకు బయలుదేరారు. ఈ సందర్భంగా దారి పొడవునా గ్రామాలు, పట్టణాల ప్రధాన కూడళ్ల వద్ద బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు భారీ సంఖ్యలో గుమిగూడారు. “జై తెలంగాణ.. జై కేసీఆర్” అంటూ నినాదాలతో హోరెత్తిస్తూ తమ అభిమాన నాయకుడికి ఘన స్వాగతం పలికారు. కేసీఆర్ సైతం వాహనంలో నుంచే నాయకులు, ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకు సాగారు.

- Advertisement -