తెలుగు జాతి కీర్తి పతాక..పీవీ నరసింహారావు

545
PV-Narasimha-Rao
- Advertisement -

భారత ప్రధానమంత్రి పదవిని అధిష్టించిన మొదటి దక్షిణాత్యుడు. ఒకే ఒక్క తెలుగువాడు, పాములపర్తి వేంకట నరసింహారావు. అది కాంగ్రెస్‌ పార్టీకి అది చాలా క్లిష్టసమయం. ప్రభుత్వానికి సంపూర్ణ మెజారిటీ లేని పరిస్థితి. తుమ్మితే కూలిపోయే ప్రభుత్వాన్ని చిన్న కుదుపులు కూడా లేకుండా ఐదేళ్ల పూర్తి కాలంపాటు నడిపించిన ఘనత ఆయనది. అవసాన దశకు చేరుకున్న దేశ ఆర్థిక వ్యవస్థకు కొత్త ఊపిరులూది ప్రపంచంలో శక్తిమంతమైన ఆర్థిక వ్యవస్థల్లో ఒకటిగా నిలబెట్టిన ధీరత్వం పీవీది.  ఐదు సంవత్సరాల పరిపాలనా కాలాన్ని పూర్తి చేసుకున్న ప్రధానమంత్రుల్లో నెహ్రూ, గాంధీ కుటుంబాల తర్వాత మొదటి వ్యక్తి, పీవీయే. మైనారిటీ ప్రభుత్వానికి నేతృత్వం వహిస్తూ కూడా, ఇది సాధించడం ఆయన రాజనీతికి, చాకచక్యానికి నిదర్శనం. అందుకే ఆయన్ని అపర చాణక్యుడు అని అన్నారు. ఇవాళ ఆయన పుట్టినరోజు సందర్భంగా greattelangaana.com  ప్రత్యేకకథనం.

1921, జూన్ 28న జన్మించిన పీవీ.. బహుభాషావేత్త, రచయిత.  భారత ఆర్ధిక వ్యవస్థలో విప్లవాత్మకమైన సంస్కరణలకు బీజంవేసి, కుంటుతున్న వ్యవస్థను తిరిగి పట్టాలెక్కించిన ఘనత సొంతం చేసుకున్న వ్యక్తి.

1957లో శాసనసభ్యుడిగా రాజకీయజీవితం ఆరంభించిన పీవీ రాష్ట్రమంత్రిగా, ముఖ్యమంత్రిగానే కాకుండా కేంద్ర రాజకీయాలలో కూడా ప్రవేశించి ప్రధానమంత్రి పదవిని చేపట్టాడు. కాంగ్రెస్ నేతృత్వంలో తగిన సంఖ్యాబలం లేని మైనారిటీ ప్రభుత్వాన్ని పూర్తికాలం నడిపించడం అతని ఘనకార్యం. రాష్ట్ర రాజకీయాల్లో పీవీ 1957 లో మంథని నియోజకవర్గం నుంచి శాసనసభకు ఎన్నికవడం ద్వారా పీవీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రస్థాయి పదవీ రాజకీయాల్లోకి అడుగుపెట్టాడు. ఇదే నియోజకవర్గం నుంచి వరుసగా నాలుగు సార్లు శాసన సభ్యునిగా ఎన్నికయ్యారు. 1962లో తొలిసారి మంత్రి అయ్యాడు. 1962 నుంచి 1964 వరకు న్యాయ, సమాచార శాఖ మంత్రిగా, 1964 నుంచి 67 వరకు న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి, 1967లో వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి, 1968-71 కాలంలో న్యాయ, సమాచార మంత్రిగా పదవులు నిర్వహించారు.

ముఖ్యమంత్రిగా  భూసంస్కరణలను అమలుపరచేందుకు చర్యలు తీసుకున్నాడు. పట్టణ భూ గరిష్ట పరిమితి చట్టం తెచ్చింది కూడా పీవీయే. నిజానికి భూసంస్కరణల విషయంలో పీవీకి సమకాలీన రాజకీయ నాయకులతో ఉన్న విభేధాల కారణంగానే ఆయన ముఖ్యమంత్రి పదవిని కోల్పోవలసివచ్చింది.

కేంద్రంలో కాంగ్రెస్ క్లిషంగా ఉన్న సమయంలో నంద్యాల లోక్‌సభ నుండి గంగుల ప్రతాపరెడ్డితో రాజీనామా చేయించి, అక్కడి ఉప ఎన్నికలో గెలిచి, పీవీ లోక్‌సభలో అడుగుపెట్టారు. ప్రధానిగా ఉండగా మన్మోహన్‌సింగ్‌ను ఆర్థిక మంత్రిగా తీసుకురావడం దేశ ప్రగతిలో కీలక మార్పుకు నాంది పలికింది. అది పీవీ విశిష్టత. ఆయన బహుభాషా పండితుడు. తెలుగుతో సహా 17 భాషలలో ధారాళంగా మాట్లాడగలిగిన ప్రజ్ఞ ఆయనది. 1983 అలీన దేశాల శిఖరాగ్ర సమావేశంలో స్పానిష్‌లో మాట్లాడి క్యూబా అధ్యక్షుడు ఫీడెల్ కాస్ట్రోను అబ్బురపరచాడు. 2004 డిసెంబర్ 23 న పి.వి.నరసింహారావు కన్నుమూశారు.

Also Read:కేసీఆర్‌ పిటిషన్‌పై తీర్పు రిజర్వ్

- Advertisement -