పర్యావరణ పరిరక్షణే ప్రాణంగా బతికిన పద్మశ్రీ వనజీవి రామయ్య మృతిపట్ల బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ విచారం వ్యక్తం చేస్తూ, సంతాపం ప్రకటించారు.వృక్షో రక్షతి రక్షితః ” అనే నినాదాన్ని తన శరీరంలో భాగం చేసుకుని, కోటికి పైగా మొక్కలను నాటి, ప్రపంచానికి పచ్చదనం ప్రాముఖ్యతను ప్రచారం చేసిన వనజీవి రామయ్య లక్ష్యం మహోన్నతమైనదని అన్నారు.
మొక్కల పెంపకం కోసం వనజీవి గా మారిన దర్పల్లి రామయ్య జీవితం రేపటి తరాలకు ఆదర్శనీయమని కొనియాడారు.ప్రపంచ పర్యావరణ కోసం సాగిన మానవ కృషిలో వనజీవి గా వారు చేసిన త్యాగం అసమాన్యమైనదని కేసీఆర్ అన్నారు.
అడవులు, పచ్చదనం అభివృద్ధి దిశగా నాటి బి ఆర్ ఎస్ ప్రభుత్వం అమలు చేసిన.. తెలంగాణ కు హరిత హారం … ప్రతిష్టాత్మక కార్యక్రమాన్ని మరింతగా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు దర్పల్లి రామయ్య గారు అందించిన సహకారం గొప్పదని కేసీఆర్ గుర్తు చేసుకున్నారు. భవిష్యత్తు తరాలకు మనం అందించే సంపద హరిత సంపదే కావాలని, భౌతిక ఆస్తులు కావనీ కేసీఆర్ పునరుద్ఘాటించారు.
పచ్చని అడవులను ధ్వంసం చేస్తూ, వన్యప్రాణులకు నిలువనీడ లేకుండా ప్రభుత్వాలు ప్రదర్శిస్తున్న పర్యావరణ వ్యతిరేక ధోరణులను నిలువరించడానికి, వర్తమాన పరిస్థితుల్లో వేలాది వనజీవి రామయ్యల అవసరం ఉన్నదని కేసీఆర్ స్పష్టం చేసారు.వనజీవి మరణంతో తెలంగాణ ఒక ప్రపంచ పర్యావరణ వేత్తను కోల్పోయిందని విచారం వ్యక్తం చేశారు.
Also Read:వనజీవి రామయ్య మృతి తీరని లోటు:హరీష్
శోకంలో మునిగిన వారి కుటుంబ సభ్యులకు అభిమానులకు పర్యావరణ పరిరక్షకులకు కేసీఆర్ తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.

