పెద్ది మృతి..కేసీఆర్,కేటీఆర్ సంతాపం

3
- Advertisement -

తెలంగాణ ఉద్యమకారుడు నర్సంపేట మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నేత పెద్ది సుదర్శన్ రెడ్డి మరణం పట్ల పార్టీ అధినేత కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతితో తన సంతాపాన్ని ప్రకటించారు. ఉద్యమ సహచరున్ని, ఆప్త మిత్రున్ని కోల్పోయానని ఆవేదన వ్యక్తం చేస్తూ పెద్ది మరణం పట్ల కేసీఆర్ తీవ్ర విచారాన్ని వ్యక్తం చేశారు.తెలంగాణ రాష్ట్ర సాధన కోసం సాగిన మలిదశ పోరాటంలో, వరంగల్లు జిల్లా ఉద్యమంలో, తనతోపాటు కలిసి నడిచిన జ్ఞాపకాలను కేసీఆర్ ఈ సందర్భంగా స్మరించుకున్నారు.

పెద్దిని బతికించుకోవడానికి పార్టీ చేసిన విశ్వప్రయత్నాలూ, డాక్టర్లు చేసిన కృషి విఫలం కావడం పట్ల కేసీఆర్ మనోవేదనను వ్యక్తం చేశారు.తెలంగాణనే శ్వాసగా, నీతి నిజాయితీతో ప్రజాజీవనం కొనసాగిస్తూ సాగించిన రాజకీయ ప్రస్థానం ఆదర్శప్రాయమన్నారు.పోరాటాల ఖిల్లా ఉమ్మడి వరంగల్ జిల్లాలోని నర్సంపేట గడ్డపై బీఆర్ఎస్ గులాబీ జెండాను ఎగురవేసి, మొక్కవోని ధైర్యంతో ఉద్యమించిన ధీరుడు సుదర్శన్ రెడ్డి అని కేసీఆర్ గారు కొనియాడారు.ఉద్యమకాలం నుంచి చివరిశ్వాస వరకూ గులాబీ జెండా నీడలో, పార్టీ అడుగుజాడల్లో నడిచిన పెద్ది, అటు పోరాటంలోనూ, ఇటు నియోజకవర్గ అభివృద్ధిలోనూ తనకంటూ చెరగని ముద్ర వేసుకున్నాడని తెలిపారు.

పార్టీ పట్ల అత్యంత విధేయతతో పనిచేసిన పెద్ది సుదర్శన్ రెడ్డి మరణం పార్టీకి తీరని లోటని కేసీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు.పోలీసు ఒత్తిళ్లు, నాన్-బెయిలబుల్ కేసులు, జైలు నిర్బంధాలకు కూడా లొంగని పెద్ది సుదర్శన్ రెడ్డి ఉద్యమ పటిమ, ధైర్య సాహసాలు, స్ఫూర్తి, ఆయన చేసిన సేవలు నియోజకవర్గ కార్యకర్తలు ప్రజల హృదయాల్లో చెరగని ముద్రవేసుకుంటాయని అన్నారు.పెద్దిని కోల్పోయి శోక తప్త హృదయులై ఉన్న భార్యాపిల్లలకు పార్టీ అండగా నిలుస్తుందని భరోసా ఇచ్చారు.

Also Read:ఇంజినీర్లను అవమానిస్తారా?

నియోజకవర్గ పార్టీ కార్యకర్తలు ఈ కష్ట సమయంలో ధైర్యంగా ఉండాలని అధినేత సూచించారు.పెద్ది సుదర్శన్ రెడ్డి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తూ, పెద్ది కుటుంబ సభ్యులకు, నియోజకవర్గ కార్యకర్తలు అభిమానులకు, కేసీఆర్ గారు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

తెలంగాణ ఉద్యమ సహచరుడు, మాజీ ఎమ్మెల్యే, నిబద్ధత కలిగిన ఉద్యమ నాయకుడు శ్రీ పెద్ది సుదర్శన్ రెడ్డి గారి మరణం నన్ను తీవ్ర దిగ్భ్రాంతికి, విషాదానికి గురిచేసింది అని కేటీఆర్ విచారం వ్యక్తం చేశారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సమయంలో ఆయన కోలుకుని తిరిగి ప్రజల మధ్యకు వస్తారనే ఆశతో ఎదురుచూశాం కానీ ఆయన ఇక మన మధ్య లేరన్న వార్త ఎంతో బాధాకరం అన్నారు.

తెలంగాణ రాష్ట్ర సాధన కోసం జరిగిన ఉద్యమంలో ఆయన పోషించిన పాత్ర చిరస్మరణీయం.ఉద్యమ ఆశయాలను జీవితాంతం నమ్మి, ప్రజల పక్షాన నిలబడి, పార్టీ బలోపేతానికి అంకితభావంతో పనిచేసిన నాయకుడిగా పెద్ది సుదర్శన్ రెడ్డి గారు ఎప్పటికీ గుర్తుండిపోతారు.పెద్ది సుదర్శన్ రెడ్డి గారి మరణం భారత రాష్ట్ర సమితి పార్టీకి మాత్రమే కాదు, తెలంగాణ సమాజానికి కూడా తీరని లోటు. ఆయన చూపిన నిబద్ధత, సేవా తపన, ఉద్యమ స్ఫూర్తి పార్టీ కార్యకర్తలకు ఎల్లప్పుడూ స్ఫూర్తిదాయకంగా నిలుస్తాయి.పెద్ది సుదర్శన్ రెడ్డి గారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను. వారి కుటుంబ సభ్యులకు అభిమానులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. ఈ విషాదాన్ని తట్టుకునే మనోధైర్యాన్ని ఆ కుటుంబానికి ప్రసాదించాలని ఆ భగవంతుడిని వేడుకుంటున్నాను అన్నారు.

- Advertisement -