జాతిపిత మహాత్మాగాంధీ 150వ జయంతి వేడుకలు దేశవ్యాప్తంగా ఘనంగా జరుగుతున్నాయి. సినీ,రాజకీయ రంగాలకు చెందిన ప్రముఖులు మహాత్మునికి ఘన నివాళి అర్పించారు. హైదరాబాద్ లంగర్‌హౌస్‌లోని బాపుఘాట్‌లో గవర్నర్ నరసింహన్, ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు నివాళులర్పించారు. అనంతరం సర్వమత ప్రార్థనలు నిర్వహించారు.
గాంధీజి కలలు కన్న గ్రామ స్వరాజ్యం కోసం కేసీఆర్ పనిచేస్తున్నారని మంత్రి హరీష్ రావు అన్నారు. ప్రజాస్వామ్య పద్ధతిలో స్వాతంత్య్రం తేవడానికి గాంధీ మార్గదర్శకులు అయ్యారని ఆయన స్వాతంత్య్రం తేవడం వల్లే ఈ రోజు మనం స్వేచ్ఛా వాయువులు పీల్చుకుంటున్నామని చెప్పారు. సీఎం కేసీఆర్ కూడా 14 సంవత్సరాలు అహింసాయుత పోరాటం చేసి తెలంగాణ సాధించారని స్పష్టం చెప్పారు.
ఇతరుల కోసం జీవించి దేశాన్ని అభివృద్ధి మార్గంలో నడిపించిన మహానీయుడు గాంధీజి అని కొనియాడారు ప్రధానమంత్రి నరేంద్రమోడీ. గాంధీజీ సందేశాలు ఎందరో భారతీయులకు ధైర్యాన్ని ప్రసాదించాయన్నారు.
బాపూ.. అహింసతో నువ్వు స్వరాజ్యం సాధించిన దేశంలో హింసను చూస్తుంటే నువ్వు మళ్ళీ పుట్టాలని కోరుకుంటున్నామని సినీ రచయిత పరుచూరి గోపాలకృష్ణ అన్నారు. మళ్ళీ జన్మించు మహాత్మా.. అందరి కోరికా ఇదే అని భావిస్తూ గాంధీ జయంతి శుభాకాంక్షలు తెలిపారు.
జాతిపిత మహాత్మా గాంధీజీకి సెల్యూట్ అని రాశీ ఖన్నా ట్వీట్ చేయగా మేడ్ ఇన్ ఇండియా గురించి పాఠాలు నేర్పిన వ్యక్తికి సెల్యూట్ చేద్దామంటూ అనుష్క శర్మ తెలిపారు. గాంధీజీ దేశం బాగు కోసం తనకు నచ్చింది చేశారు. మీరు కూడా మీ హక్కుల కోసం ధైర్యంగా పోరాడాలని ఆశిస్తున్నానని హన్సిక ట్వీట్ చేసింది.