సీఐడీ విచారణకు సీఎం ఆదేశం..

223
KCR orders CID Enquiry into Miyapur land case
KCR orders CID Enquiry into Miyapur land case
- Advertisement -

మియాపూర్ భారీ భూ కుంభకోణంపై ముఖ్యమంత్రి కేసీఆర్ సీరియస్ అయ్యారు. భూ కుంభకోణంపై సమీక్ష నిర్వహించిన ఆయన… రిజిస్ట్రేషన్ శాఖ అధికారుల పనితీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కుంభకోణంపై సమగ్ర విచారణ జరపాలంటూ సీఐడీని ఆదేశించారు. ఇందులో ఉన్న నిందితులు ఎంతటివారైనా సరే కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. దీనికి తోడు రిజిస్ట్రేషన్ చట్టంలోని లొసుగులకు చెక్ పెట్టాలని సూచించారు.ఎనీ వేర్ రిజిస్ట్రేషన్ విధానాన్ని (ఎక్కడి ఆస్తిని మరెక్కడి రిజిష్ట్రార్ కార్యాలయంలోనైనా రిజిస్ట్రేషన్ చేసే విధానం) తెలంగాణ రాష్ట్రంలో రద్దు చేయాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు. సీఎం ఆదేశాల మేరకు రిజిస్ర్టేషన్ శాఖలో ఎనీ వేర్ రిజిస్ర్టేషన్ విధానాన్ని రద్దు చేస్తూ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు.

మియాపూర్‌ భూకుంభకోణం నివేదికలో పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు పోలీసులు. 693 ఎకరాల ప్రభుత్వ భూమిపై కన్నేసిన పార్థసారథి, శర్మలు పక్కా వ్యూహం రచించారన్నారు. అందులో భాగంగానే కైసారుద్దీన్‌ ఖాన్‌ వారసులుగా చెప్పుకొంటున్న అమీరున్నీసా బేగం, మరో ఏడుగురి నుంచి ట్రినిటీ ఇన్‌ఫ్రా ప్రతినిధిగా పార్థసారథి 2016 జనవరి 15న జీపీఏ తీసుకున్నారని వివరించారు. జీపీఏ తీసుకున్న రోజే పార్థసారథి 693 ఎకరాలను సువిశాల్‌ కంపెనీకి విక్రయించారని తెలిపారు. నిబంధనలనకు విరుద్ధంగా సబ్‌రిజిస్ట్రార్‌ ఒక రిజిస్టర్‌(బుక్‌-1) బదులు మరో రిజిస్టర్‌(బుక్‌-4)లో రిజిస్ట్రేషన్‌ చేశారని వెల్లడించారు. విక్రయ ఒప్పంద పత్రాలు 11 నెలలు పెండింగ్‌లో ఉన్నప్పటికీ వాటిని పరిశీలించలేదన్నారు. 693 ఎకరాల ప్రభుత్వ భూమిని కాజేయడంలో భాగంగా నిందితులకు హక్కులు కల్పించడానికి సబ్‌రిజిస్ట్రార్‌ శ్రీనివాసరావు సహకరించారని వివరించారు. ఈ వ్యవహారంలో ప్రభుత్వానికి మొత్తం రూ.587.11 కోట్ల నష్టం వాటిల్లిందని చెప్పారు.

miyapur land

మరోవైపు ఈ కేసులో నిందితులు సబ్‌రిజిస్ట్రార్‌ ఆర్‌.శ్రీనివాసరావు, ట్రినిటీ డైరెక్టర్‌ పి.ఎస్‌.పార్థసారథి, గోల్డ్‌స్టోన్‌ జనరల్‌ మేనేజర్‌, సువిశాల్‌ డైరెక్టర్‌ పి.వి.ఎస్‌.శర్మలను అరెస్ట్‌ చేసి కూకట్‌పల్లి 5వ అదనపు జూనియర్‌ సివిల్‌ జడ్జి ముందు హాజరుపరిచారు. రిమాండ్‌ రిపోర్టును పరిశీలించిన కోర్టు నిందితులకు 14 రోజుల జ్యుడీషియల్‌ రిమాండ్‌ విధించింది. మరిన్ని వివరాలను రాబట్టాల్సి ఉన్నందున నిందితులను 10 రోజుల కస్టడీకి ఇవ్వాలని పోలీసులు పిటిషన్‌ దాఖలు చేశారు. ఇదే సమయంలో బెయిల్ కోసం నిందితులు పెట్టుకున్న పిటిషన్ ను కోర్టు కొట్టేసింది. అయితే ప్రధాన నిందితుడిగా భావిస్తున్న గోల్డ్ స్టోన్ ప్రసాద్ ఆచూకీ ఇంతవరకు లభించలేదు. ఆయన తన భార్య, కోడలు, కుటుంబసభ్యుల పేరుతో వెయ్యి ఎకరాల ప్రభుత్వ భూములను రిజిస్ట్రేషన్ చేయించినట్టు పోలీసులు గుర్తించారు.

దోషులు ఎంత పెద్దవారైనా ఉపేక్షించేది లేదని, కఠినంగా శిక్షించి తీరుతామన్నారు డిప్యూటీ సీఎం మహమూద్ అలీ. కూకట్‌పల్లి సబ్ రిజిస్ట్రార్ 796.04 ఎకరాల భూమిని 2016 నవంబర్‌లో రిజిస్ట్రేషన్ చేశారని డిప్యూటీ సీఎం టతెలిపారు. ఇందులో సర్వేనెంబర్ 100కు చెందిన 207 ఎకరాలు, సర్వేనెంబర్101కి చెందిన 231 ఎకరాలు, సర్వేనెంబర్ 20కి చెందిన109 ఎకరాల 18 గుంటల భూమి ప్రభుత్వానిదన్నారు. ఇది కాకుంగా సర్వేనెంబర్ 28కి చెందిన 145 ఎకరాల 26 గుంటలు, సర్వేనెంబర్44కు చెందిన 5ఎకరాలు, సర్వేనెంబర్ 45కు చెదిన 98 ఎకరాల భూమిని కూడా రిజిస్ట్రేషన్ చేశారని తెలిపారు. ప్రస్తుతం ఈ భూముల రజిస్ట్రేషన్ రద్దు చేశామని, దీనిపై ఇంకా లోతైన విచారణ జరుగుతుందని ఆయన వివరించారు. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలో విలువైన భూములు ఉన్నందున ఇక్కడ చాలా కాలంగా పనిచేస్తున్న రిజిస్ట్రార్లను ఇతర జిల్లాలకు బదిలీ చేస్తామన్నారు.

- Advertisement -