చిత్రకారుడు చంద్ర మృతి.. సీఎం కేసీఆర్ సంతాపం..

131
kcr
- Advertisement -

వరంగల్ జిల్లాకు చెందిన ప్రముఖ చిత్రకారుడు చంద్ర శేఖర్ (చంద్ర) గురువారం హైదరాబాద్ లోని కార్ఖానా మదర్ థెరెస్సా రిహాబిలిటేషన్ సెంటర్‌లో తుది శ్వాస విడిచారు. ఆయన మరణం పట్ల సీఎం కేసీఆర్ సంతాపం వ్యక్తం చేశారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. కాగా, ఆర్టిస్ట్ చంద్ర పూర్తి పేరు మైదమ్ చంద్ర శేఖర్. ఆయన 1946 ఆగస్ట్ 28 వరంగల్‌లో జన్మించారు. భార్య తాళ్ళూరి విజయ భార్గవి. వారికి ఇద్దరు కొడుకులు ఒక బిడ్డ ఉన్నారు. వారు విదేశాలలో స్థిర పడ్డారు. రాజకీయ ,సామాజిక వ్యంగ్య కార్టూన్లకు ఆయన పెట్టింది పేరు.. కొన్ని కథలు కూడా రాశారు. ప్రముఖుల రేఖా చిత్రాలకు ఆయన స్పెషలిస్ట్. ఎంతో మంది తెలుగు, జాతీయ, అంతర్జాతీయ ప్రముఖుల రేఖా చిత్రాలు గీశారు. ఆయన ప్రకృతి చిత్రాలతో పాటు జానపద, భక్తి,ఆధ్యాత్మిక, విప్లవ, పౌరాణిక, ఆధునిక భావజాలాలకు చెందిన వేలాది బొమ్మలు గీశారు.

అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీలో ప్రధాన చిత్రకారుడిగా పనిచేశారు. నవలలకు, పుస్తకాలకు ఆయన వేసిన ముఖ చిత్రాలు ప్రధాన ఆకర్షణగా ఉండేవి..1970 నుండి 2010 వరకు దాదాపు ముప్ఫై ఏళ్ళు చంద్ర వేసిన ముఖ చిత్రంతో కొన్ని వేల పుస్తకాలు వెలువడ్డాయి. మనుష్యుల మానసిక ప్రపంచాన్ని, స్త్రీ పురుషులలోని ఆంగిక సౌందర్యాన్ని ఎంతో కళాత్మకంగా చిత్రించిన ప్రత్యేక శైలి ఆయనది. చంద్ర గారు చిత్ర నిర్మాణం, సినిమా రంగంలో కూడా పని చేశారు. రంగుల కల చిత్రంలో నటించారు కూడా. దాశరథి రంగాచార్య నవల చిల్లరదేవుళ్లు సినిమాకు, మాభూమి సినిమాకు పని చేశారు ఆయన. దాశరథి కృష్ణమాచార్య ,పల్లా దుర్గయ్య,కాళోజీ లకు అత్యంత సన్నిహితంగా మెలిగారు ఆర్టిస్ట్ చంద్ర.

- Advertisement -