ఎట్టకేలకు తెలంగాణ కేబినెట్ విస్తరణకు ముహూర్తం ఖరారైన సంగతి తెలిసిందే. ఈ నెల 19న ఉదయం 11.30కు కేబినెట్ మంత్రులు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇక అంతా ఉహించినట్లే తిథి,గడియా,మంచిరోజు చూసుకుని మాఘ శుద్ద పౌర్ణమి రోజున కేబినెట్ విస్తరణకు ముహుర్తం ఖరారు చేశారు సీఎం కేసీఆర్. కేబినెట్ విస్తరణకు ముహూర్తం ఖరారుతోనే మంత్రి వర్గంపై చర్చ మొదలైంది. ఈసారి పూర్తి స్ధాయి విస్తరణ ఉంటుందా? లేక ఎంతమందితో విస్తరణ ఉంటుంది అనేదానిపై పుకార్లు షికార్ చేస్తున్నాయి. .
అయితే ఈ సారి కేబినెట్‌లో వీర విధేయతకే పట్టం కట్టారట కేసీఆర్. దీంతో పాటు గతంలో తాను మాట ఇచ్చిన విధంగా సీనియర్లకు ఛాన్స్ ఇవ్వనున్నారని సమాచారం. ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన ఎర్రబెల్లి దయాకర్ రావుతో పాటు నల్గొండ జిల్లాకు చెందిన గుత్తా సుఖేందర్ రెడ్డి కేబినెట్‌లో బెర్త్ కన్ఫామ్ అని ప్రచారం జరుగుతోంది. వీరితో పాటు తలసాని,ఈటల,కొప్పుల పేర్లు ప్రచారంలో ఉన్నాయి.
కేసీఆర్ వీర విధేయులు సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, వేముల ప్రశాంత్ రెడ్డికి కేబినెట్‌లో బెర్త్ కన్ఫామ్ అయిపోయిందని పార్టీ నేతలు చెబుతున్నారు. ఇక మహిళా కోటలో రేఖా నాయక్, పద్మా దేవేందర్ రెడ్డి మంత్రిపదవి కోసం పోటీపడుతుండగా పద్మా దేవేందర్ రెడ్డి వైపు కేసీఆర్ మొగ్గుచూపారని సమాచారం. దీంతో పాటు టీడీపీ నుండి గెలిచిన సండ్ర వెంకటవీరయ్యకు మంత్రిపదవి ఖాయమని ప్రచారం జరుగుతోంది. ఈ వార్తలకు అనుగుణంగానే టీటీడీ బోర్డు సభ్యుడిగా ఉన్న సండ్రను తొలగిస్తు ఉత్తర్వులు జారీచేసింది ఏపీ ప్రభుత్వం.
సభా నిర్వహణలో విప్‌లు, ఛీప్ విప్‌లు, డిప్యూటి స్పీకర్‌లు ఖచ్చితంగా ఉండాలి. కాబట్టి బడ్జెట్ సమావేశాలు ప్రారంభానికి ముందే కేబినెట్‌లో ఛాన్స్ దక్కనివారికి ఈ పదవులను కట్టబెట్టనున్నారట. మొత్తంగా వీరవిధేయులకు పట్టంకడుతు కేసీఆర్ తనదైన మార్క్‌తో మంత్రివర్గ విస్తరణ చేపట్టనున్నారు.