పాసు పుస్తకాలు, చెక్కుల పంపిణీ నూటికి నూరు శాతం పూర్తయ్యే వరకు విశ్రమించవద్దని సీఎం కేసీఆర్ అధికారులకు సూచించారు. ప్రగతిభవన్‌లో మంత్రులు,కలెక్టర్లతో రివ్యూ నిర్వహించిన సీఎం జిల్లాల వారీగా ఇప్పటి వరకు ఎన్ని పాసుపుస్తకాలు పంపిణీ చేశారు, ఎంత మందికి చెక్కులిచ్చారు, మిగతా వారికి ఏ కారణంతో పంపిణీ చేయలేదనే దానిపై అధికారులను అడిగి తెలుసుకున్నారు.
పాసు పుస్తకాల్లో దొర్లిన తప్పులను కూడా సవరించాలని సీఎం కేసీఆర్ అధికారులను కోరారు. వంద రోజులపాటు భూ రికార్డుల ప్రక్షాళన జరిగినప్పటికీ, ఇంకా కొన్ని చోట్ల రికార్డుల్లో తప్పులు దొర్లడం, అసమగ్ర వివరాలుండడం పట్ల ముఖ్యమంత్రి అసహనం వ్యక్తం చేశారు.ఇంత పెద్ద కార్యక్రమం నిర్వహించినప్పుడు కొన్ని సమస్యలు తప్పవని, ఈ పరిస్థితిని సవాల్ గా తీసుకుని, మరింత ప్రభావవంతంగా పనిచేయాలని ముఖ్యమంత్రి సూచించారు.
జిల్లాల పునర్విభజన వల్ల కొత్త జిల్లాలు ఏర్పడ్డాయని, కలెక్టర్లకు పర్యవేక్షణ సులభమయిందని, దీన్ని సానుకూలాంశంగా తీసుకుని మరింత చిత్తశుద్దితో కార్యక్షేత్రంలో విధులు నిర్వహించాలని సీఎం కేసీఆర్ ఉద్బోధించారు. వచ్చే నెల నుంచి కొత్త రిజిస్ట్రేషన్ విధానం అమల్లోకి వస్తుందని, రైతులకు జీవిత బీమా పథకం కూడా అమల్లోకి వస్తుందని, ఇవి సవ్యంగా సాగాలంటే భూమి రికార్డులు సరిగా ఉండాలని చెప్పారు. ఈ సమావేశంలో స్పీకర్ మధుసూదనా చారి, ఉప ముఖ్యమంత్రులు, మంత్రులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్.కె.జోషి, ముఖ్య కార్యదర్శులు, జిల్లా కలెక్టర్లు పాల్గొన్నారు.