సంక్షేమ యజ్ఞంలో భాగంగా తెలంగాణ ప్రభుత్వం మరో భారీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. శతాబ్ద కాలంగా రెడ్డి విద్యార్థుల విద్యాభివృద్ధికి పాటుపడుతున్న రెడ్డి హాస్టల్‌కు రాష్ట్ర ప్రభుత్వం వెన్నుదన్నుగా నిలిచింది. రెడ్డి హాస్టల్ శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ మండలం బుద్వేల్‌లో 10 ఎకరాల స్థలంలో రెడ్డి హాస్టల్ (ఆర్‌బీవీఆర్‌ఆర్ ఎడ్యుకేషన్ సొసైటీ క్యాంపస్) భవన నిర్మాణానికి సీఎం కేసీఆర్ ఇవాళ శంకుస్థాపన చేశారు.
గ్రామీణ ప్రాంత పేద రెడ్డి విద్యార్థులకు నగరంలో వసతి కల్పించి, విద్యా వంతులుగా తీర్చిదిద్దాలనే ఆశయంతో 1917 రెడ్డి హాస్టల్ ను స్థాపించారు. అబిడ్స్‌లో 4 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న హాస్టల్‌లో ప్రస్తుతం వెయ్యి మందికి పైగా విద్యార్థులు వసతి పొందుతున్నారు. మాజీ ప్రధాని పీవీ నర్సింహారావు, జస్టిస్ జీవన్ రెడ్డితో పాటు పలువురు ఐఏఎస్, ఐపీఎస్‌లు ఇక్కడే వసతి పొందారు.
ప్రస్తుతం అబిడ్స్ లో ఉన్న రెడ్డి హాస్టల్ క్యాంపస్ సరిపోవడం లేదని.. అందుకే ప్రత్యేకంగా కొంత స్థలాన్ని కేటాయించాలని రెడ్డి ఎడ్యుకేషనల్ ట్రస్టు ప్రతినిధులు సీఎం కేసీఆర్ ను కోరారు. తెలంగాణలో విద్యావ్యాప్తి కోసం వెంకటరామారెడ్డి చేసిన సేవలను గుర్తించిన సీఎం.. బుద్వేల్‌లో రెడ్డి ఎడ్యుకేషన్ క్యాంపస్ నిర్మాణానికి పదెకరాల స్థలం, రూ.10 కోట్లను మంజూరు చేశారు. వెంకట్రామిరెడ్డి జయంతి సందర్భంగా నేడు రెడ్డి హాస్టల్ నిర్మాణానికి ముఖ్యమంత్రి కేసీఆర్ శంకుస్థాపన చేశారు.
ఈ రెడ్డి హాస్టల్ భవనంలో 70 శాతం మంది రెడ్డి విద్యార్థులతోపాటు 30 శాతం ఇతర కులాల విద్యార్థులకు స్థానం కల్పించనున్నారు. బాలికల, బాలుర వసతిగృహంతోపాటు స్టడీ సర్కిల్ కూడా అందుబాటులో ఉండనుంది. ఈ కార్యక్రమంలో మంత్రులు నాయిని,మహేందర్ రెడ్డి, కేటీఆర్ ఎంపీలు జితేందర్ రెడ్డి, కొండా విశ్వేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్యే ముత్తిరెడ్డి, సుధీర్ రెడ్డితో పాటు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.