రైతు బంధు పథకం ద్వారా దేశ వ్యవసాయ రంగ చరిత్రలో సువర్ణాధ్యాయం లిఖితమైందని సీఎం కేసీఆర్ తెలిపారు. రైతే రాజు కావాలన్న సంకల్పంతో ఎకరానికి రూ. 8వేలు పెట్టుబడి అందించే రైతు బంధు పథకానికి శ్రీకారం చుట్టారు సీఎం కేసీఆర్. కరీంనగర్ జిల్లా ఇందిరానగర్‌లో లక్షలాది మంది రైతుల సమక్షంలో పథకాన్ని ప్రారంభించారు. ఈసందర్భంగా మాట్లాడిన కేసీఆర్…కరీంనగర్ జిల్లా అంటే తనకు ఎనలేని ప్రేమ అని…ఏ కార్యక్రమమైన ఇక్కడి నుంచి ప్రారంభిస్తే విజయం సాధిస్తామనే నమ్మకని తెలిపారు. తెలంగాణ మొదటి సంహాగర్జన కరీంనగర్ నుంచే మొదలు పెట్టామని గుర్తుచేశారు.
రైతు బంధు పథకంలో చెక్కులు,పాస్ బుక్కులు అందించేందుకు సహకరించిన అధికారులందరికీ కేసీఆర్ కృతజ్ఞతలు తెలిపారు. కరీంనగర్ బిడ్డ సివిల్స్ ఫలితాల్లో ఆల్ ఇండియా స్ధాయిలో నెంబర్ 1 ర్యాంకు సాధించారని తెలిపారు. తెలంగాణ వస్తే మీకు కరెంట్ రాదని శాపాలు పెట్టారని…కానీ అనతికాలంలోనే కరెంట్ కష్టాలను అధిగమించి యావత్ ప్రజానీకానికి 24 గంటల కరెంట్ సరఫరా చేస్తున్నామని చెప్పారు.
హోంగార్డులు,ఆశావర్కర్లు,అంగన్‌వాడీలు అత్యధిక జీతాలు ఇచ్చే రాష్ట్రం తెలంగాణ అన్నారు. కులాలు,మతాలు అనే తేడా లేకుండా రెసిడెన్షియల్ స్కూళ్ల ద్వారా విద్యార్థులందరికీ మెరుగైన విద్య అందిస్తున్నామని చెప్పారు. భారతదేశంలో స్వంత రాబడీ కలిగిన ఏకైక రాష్ట్రం తెలంగాణ అన్నారు. ప్రజల దీవెనలతో నిజాయితీగా పనిచేస్తున్నామని చెప్పారు. నీటి తీరువా బాకీ చేయించడంలో మెదక్ జిల్లా కలెక్టర్ ధర్మారెడ్డి పట్టుబట్టి మాఫీ చేయించారని తెలిపారు.
భూ రికార్డులను ప్రక్షాళన చేసిన ఘనత కూడా తెలంగాణ ప్రభుత్వానికే దక్కిందన్నారు. రైతులకు ఇబ్బందికలగకుండా బ్యాంకు అధికారులు చూడాలన్నారు. యావత్ దేశానికే తెలంగాణ దిక్సూచిగా నిలిచిందన్నారు. నాడు కరెంట్ ఉంటే వార్త….నేడు పోతే వార్త అని చెప్పారు. రెప్పపాటు కూడా కరెంట్‌ని పోనివ్వమని చెప్పారు సీఎం. కౌలు రైతులకు పెట్టుబడి ఇవ్వబోమని తెలిపారు. పాస్ పుస్తకాల్లో పట్టదారు పేరు మాత్రమే ఉంటుందని కౌలు దారు పేరు ఉండదన్నారు. కౌలు దారులకు ఇచ్చే బాధ్యత రైతులదే అన్నారు. రైతుల ప్రయోజనాలు,భూమి హక్కులు కాపాడేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు.
వ్యవసాయానికి నీళ్లు సమృద్ధిగా కావాలని చెప్పిన సీఎం…సాగునీటి ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టామన్నారు. వ్యవసాయం బాగుంటే దేశం బాగుంటుందన్నారు. రైతులకు కనీస మద్దతు ధర రావాలన్నారు. జాతీయ ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయానికి అనుసంధానం చేయాలన్నారు. రైతులు కూలీలకు ఇచ్చే డబ్బును సగం రైతులు,సగం ప్రభుత్వం బరించాలన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తైతే తెలంగాణ నిత్య కల్యాణం…పచ్చ తోరణంలా ఉంటుందన్నారు. కోటి ఎకరాలకు నీరందిచ్చి తీరుతామన్నారు.
కాంగ్రెస్ నాయకులు అభివృద్ధిని చూసి ఒర్వలేకపోతున్నారని చెప్పారు. రాష్ట్రంలో కాంగ్రెస్ దివాళ తీసిందన్నారు. సమైక్య పాలనలో అన్యాయం జరుగుతుంటే ఒక్క కాంగ్రెస్ నాయకుడు నోరు మెదపలేదన్నారు. కాంగ్రెస్ నాయకులు ఇకనైనా కళ్లు తెరవాలన్నారు. పాత కరీంనగర్ జిల్లాకు రూ. 500 కోట్లు కావాలని మంత్రి ఈటెల రాజేందర్ అడిగారని…అవి మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. రాజేందర్ నాకు అత్యంత ఆప్తుడైన తమ్ముడని తెలిపారు.
జూన్ 2 నుంచి రిజిస్ట్రేషన్లలో సరికొత్త విప్లవాత్మకమైన మార్పులు తీసుకురాబోతున్నామని చెప్పారు. దేశానికే మార్గదర్శకంగా కొత్త రిజిస్ట్రేషన్ విధానం తీసుకొస్తామన్నారు. ఎమ్మార్వోలకే రిజిస్ట్రేషన్ అధికారం ఇచ్చామన్నారు. ధరణి వెబ్ సైట్‌లో అన్ని వివరాలు అందుబాటులో ఉంటాయన్నారు. ఈ రాష్ట్రంలో జూన్ 2 తర్వాత పాస్ బుక్‌లు బ్యాంకు అధికారులు తీసుకోరన్నారు.
రైతులపై ఎంతో నమ్మకంతో ఈ కార్యక్రమం ప్రారంభించామని ఎలాంటి అవినీతికి తావు ఇవ్వకూడదన్నారు. ఇబ్బందులు వస్తే పరిష్కరించాల్సిన బాధ్యత రైతు సమన్వయ సమితులదే అన్నారు.