మొక్కలు నాటుదాం.. వర్షాలు కురిపిద్దాం:కేసీఆర్

216
KCR kicks off Haritha Haram
KCR kicks off Haritha Haram
- Advertisement -

హరితహారంలో భాగంగా సీఎం కె. చంద్రశేఖర్‌ రావు కరీంనగర్‌లో లోయర్ మానేరు డ్యామ్ వద్ద మహోగని అనే ఔషధ మొక్కను నాటి హరితహారాన్ని లాంఛనంగా ప్రారంభించారు. ఆ తరువాత కరీంనగర్‌లో అంబేద్కర్‌ గ్రౌండ్‌లో జరుగుతున్న బహిరంగ సభలో మాట్లాడారు.. కరీంనగర్ అక్కచెల్లెల్లకు దండంపెట్టి చెబుతున్నా.. “ఇంట్ల పిల్లల్ని ఎలా పెంచుతామో.. అలాగే మొక్కల్ని కాపాడుకోవాలనుకున్నారు.. మొక్కలు పెంచడం వేరే పనికాదు.. మన సొంత పని.. పుట్టినప్పటి నుండి చనిపోయేవరకు ఆలంభనగా ఉండే చెట్టును కాపాడుకోవాలి.. ప్రకృతి ఎక్కడైతే పూజింపబడుతదో.. అక్కడ వర్షిస్తది.. హర్షిస్తది.. పట్టణంలో 25వేల మొక్కలు నాటడమే కాదు.. వాటిని కాపాడుతానని ప్రతిజ్ఙ చేసిన కరీంనగర్ కమీషనర్‌ గంగుల కమల్‌హసన్‌ని అభినందిస్తున్నాను.. ప్రతిఒక్కరికీ మనవిచేస్తున్నా.. కరీంనగర్‌లో ప్రతి ఇంట్లో ఎంతమంది ఉన్నారో లెక్కతీసి.. వాళ్లకు అన్ని మొక్కలు ఇవ్వండి.. ప్రతి మొక్కకు వాళ్ల పేర్లు పెట్టండి.. నేను హెలికాప్టర్‌లో వస్తే.. ఇండ్లు కనపడొద్దు.. చెట్లె కనపడాలి.కరీంనగర్‌లో ఏ పని ప్రారంభించినా విజయం సాధిస్తూ వస్తున్నాం.. ఆరోజు ఈ గడ్డ మీద తెలంగాణ తెస్తా అన్నా.. తెలంగాణ తెచ్చినా.. అలాంటి తెలంగాణ పచ్చదనంతో అల్లాడాలె.. ఎండాకాలంలో మీరు చూస్తున్నారు.. ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి. చెట్లు పెట్టి ఎండల తీవ్రతను తగ్గించాలి.. సమాజం పట్ల శ్రద్ద ఉన్న ప్రతి ఒక్కరూ దీనికోసం కృషి చేయాలి.. ప్రతి ఊరికి 51 మంది సభ్యులతో గ్రీన్ బ్రిగేడ్ ఉండాలి.. ప్రతి గ్రామపంచాయితీ ప్రత్యేక శ్రద్ద చూపించాలి.. ప్రతీ నగరం.. పల్లె.. గ్రామం.. పట్నం.. చెట్లను బిడ్డల్లాగా చూసుకోవాలి” అని కేసీఆర్ అన్నారు.

హరిత తెలంగాణను తయారు చేయడమే ప్రభుత్వ లక్ష్యమని కేసీఆర్ ఉద్ఘాటించారు. ఈ క్రమంలో 523 అవార్డులు ఇస్తామని సీఎం ప్రకటించారు. ప్రతి జిల్లాలో ఒక గ్రామపంచాయతీకి ఉత్తమ గ్రామపంచాయతీకి రూ. 5 లక్షల చొప్పున అవార్డు ఇస్తామని తెలిపారు సీఎం. ఉత్తమ మండలానికి రూ. 8 లక్షల అవార్డు, పట్టణంలో ఉత్తమ వార్డుకు రూ. 5 లక్షల అవార్డు, ఉత్తమ ప్రాథమిక పాఠశాలకు రూ. 2 లక్షల అవార్డు, ఉత్తమ ఉన్నత పాఠశాలకు రూ. లక్షల అవార్డు, ఉత్తమ జూనియర్, డిగ్రీ, సాంకేతిక కళాశాలకు రూ. 2 లక్షల చొప్పున అవార్డు, ఉత్తమ ప్రజాప్రతినిధికి రూ. లక్ష అవార్డు, ఉత్తమ అటవీ అధికారికి రూ. లక్ష అవార్డు, ఉత్తమ గ్రామీణాభివృద్ధి అధికారికి రూ. లక్ష అవార్డులు ఇస్తామన్నారు. వీరితో పాటు పలువురు అధికారులకు, సామాన్యులకు అవార్డులు ఇస్తామని సీఎం చెప్పారు. మొత్తంగా 523 అవార్డులు ఇస్తామన్నారు.

రేపట్నుంచి 25వ తేదీ వరకు వర్షాలు విస్తారంగా పడుతాయని వాతావరణ శాఖ చెప్తుందని గుర్తు చేశారు. భూమిలో తేమశాతం పెరగాల్సిన అవసరం ఉందన్నారు. తెలంగాణ పచ్చదనంతో కళకళలాడాలి. ఇవన్నీ కావాలంటే మొక్కలను పెంచి పెద్ద చేయాలని సూచించారు సీఎం. మొక్కలు నాటడం మన సొంత పనిగా భావించినప్పుడు హరిత తెలంగాణ సాధ్యమవుతుందన్నారు.

- Advertisement -