కొంతమంది వల్ల సినీ ఇండస్ట్రీకి చెడ్డ పేరు వస్తుందని మా అధ్యక్షుడు శివాజీ రాజా అన్నారు. సినీ పరిశ్రమలో డ్రగ్స్ వినియోగం స్పందించిన మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ప్రత్యేక సమావేశం నిర్వహించింది. ఈ సమావేశంలో నిర్మాతలు దగ్గుబాటి సురేష్ బాబు, అల్లు అరవింద్, నటులు శ్రీకాంత్, నరేష్, శివాజీ రాజా, మాటల రచయిత, నటుడు పరుచూరి వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
ఇండస్ట్రీలో కేవలం 10 మంది మాత్రమే డ్రగ్స్ కు అలవాటు అయ్యారని.. వారి పేర్లు కూడా పోలీసుల దగ్గర ఉన్నాయన్నారు. వారు డ్రగ్స్ తీసుకోవటం వల్ల అన్నం పెట్టే సినీ ఇండస్ట్రీపై మచ్చ వస్తుందని.. వారి కుటుంబ సభ్యులు కూడా మానసిక క్షోభను అనుభవిస్తున్నారన్నారు. వెంటనే డ్రగ్స్ అలవాటు మానుకోవాలని పిలుపునిచ్చారు నిర్మాత అల్లు అరవింద్.
మత్తులో జీవితాలు నాశనం చేసుకోవద్దని కోరారు మరో నిర్మాత దగ్గుబాటి సురేష్. డ్రగ్స్ అలవాటు ఉన్నవారు ముందుకు వస్తే చికిత్స ద్వారా మామూలు వ్యక్తులుగా మారొచ్చన్నారు సినీ రచయిత పరుచూరి వెంకటేశ్వర్లు. కేవలం ఆ కొద్ది మంది వల్లే అందరికీ చెడ్డపేరు వస్తుందన్నారు.
సమాజంలో రేవ్ పార్టీల సంస్కృతి పెరిగిపోతోందని …. డ్రగ్స్ వినియోగం ప్రమాదకరంగా మారిందని ఈ సందర్భంగా వారు తెలిపారు. ప్రతివారు సొంతగా తమను తాము నియంత్రించుకోవాలని సూచించారు. బయటి వాళ్లు చెబితే మత్తుపదార్థాలకు అలవాటు పడ్డామని చెప్పే వ్యసనపరులు, చిన్నప్పటి నుంచి ఇంట్లో, స్కూల్, దేవాలయాల్లో చెడు పనులకు అలవాటు పడవద్దని, తప్పుడు పనులకు దూరంగా ఉండాలని చెబుతున్నా ఎందుకు పట్టించుకోరని ప్రశ్నించారు.
యువత డ్రగ్స్ కు దూరంగా ఉండాలని, డ్రగ్స్ అరికట్టేందుకు సహకరించాలని వారు పిలుపునిచ్చారు. ఇందుకు సినీ పరిశ్రమ ఆదర్శంగా నిలబడాలని వారు సూచించారు. సినిమాలలో కూడా డ్రగ్ సన్నివేశాలు పెట్టాల్సి వచ్చినప్పుడు వాటిని ఎలా రూపుమాపవచ్చో అలాగే చూపించాలని వారు అభిప్రాయపడ్డారు.

