ఏపీ,తెలంగాణ మధ్య అపరిష్కృతంగా ఉన్న సమస్యల పరిష్కారానికి ఇరు రాష్ట్రాల సీఎంలు కేసీఆర్,జగన్ దృష్టిసారించారు. ఈ నేపథ్యంలో ప్రగతిభవన్‌లో సమావేశమయ్యారు. జగన్‌తో పాటు ఏపీ సీఎస్ ఎల్వీ సుబ్రమణ్యం, సీఎం ముఖ్య కార్యదర్శి అజేయకల్లం, మంత్రులు బాలినేని శ్రీనివాస్‌రెడ్డి, రాజేంద్రనాథ్‌రెడ్డి, కన్నబాబు, పేర్ని నానితో 27 మంది సభ్యుల బృందం హాజరుకాగా తెలంగాణ ప్రభుత్వం తరఫున సీఎస్ ఎస్‌కే జోషి, మంత్రులు శ్రీనివాస్‌గౌడ్, ఈటల రాజేందర్ తదితరులు పాల్గొన్నారు.
సమావేశం ఎజెండాలో సాగునీటిపారుదల, విభజన చట్టంలోని 9, 10 షెడ్యూలు సంస్థలు, ఢిల్లీలోని ఏపీభవన్ విభజన, విద్యుత్ సమస్య, సివిల్ సప్లై కార్పోరేషన్ రూ. 1775కోట్ల బకాయిలు, ఉద్యోగుల విభజన వంటివి ఉన్నాయి. ఈ సమావేశానికి రెండు రాష్ట్రాలకు చెందిన ముఖ్యమైన అధికారులు, ఇంజినీరింగ్ నిపుణులు కూడా హాజరయ్యారు.
ఈ సమావేశానికి కొనసాగింపుగా జూలై మూడున రెండు రాష్ట్రాలకు చెందిన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు గవర్నర్ సమక్షంలో సమావేశమై సీఎంల సమావేశంలో అంగీకారానికి వచ్చిన అంశాలపై తుదిరూపమివ్వనున్నారు.