ప్రతీ శాఖ జిల్లా విభాగాధిపతుల నియామకం వెంటనే జరపాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు చెప్పారు. నగరంలోని ఎంసీఆర్‌హెచ్‌ఆర్డీలో మంత్రులు, అధికారులతో సమావేశమైన సీఎం కేసీఆర్ కొత్త జిల్లాల ఆవిర్భావ ఏర్పాట్లు, పాలనా అంశాలపై చర్చించారు.
సీనియారిటీ ప్రాతిపదికన జిల్లా అధికారుల నియామకం జరపాలని… ప్రతీ శాఖ కూడా డి.పి.సి. నిర్వహించి పదోన్నతులు ఇవ్వాలని చెప్పారు. పని భారం ఎక్కువ ఉన్న శాఖల్లో అవసరమైన ఉద్యోగులను నియమిస్తామని, దీనికోసం ప్రతిపాదనలు పంపాలని సిఎం కేసీఆర్ చెప్పారు. పరిపాలనా విభాగాల విస్తరణ జరుగుతుంది కాబట్టి, ఆయా విభాగాల ఇన్ చార్జిలకు అధికారాలు, విధుల బదలాయింపు జరగాలని సిఎం ఆదేశించారు. రాష్ట్రంలో ఇప్పుడు పెద్ద ఎత్తున నీటి ప్రాజెక్టులు కడుతున్నామని, రహదారులు నిర్మిస్తున్నామని, మిషన్ భగీరథ చేపట్టామన్నారు. వీటి కోసం చాలా మంది ఉద్యోగులను నియమిస్తున్నామని, ఆ పని పూర్తయిన తర్వాత ఆ ఉద్యోగులను మరో పనికి ఉపయోగించే విషయంలో అవసరమైన కార్యాచరణ రూపొందించాలన్నారు. ఉద్యోగులను తమ వృత్తి స్వభావాన్ని బట్టి ఏ బాధ్యతలకు, ఏ ప్రాంతానికైనా బదిలీ చేసే వెసులుబాటు ప్రభుత్వానికుండేలా నిబంధనలు తయారు చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.
“పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్, ఎలక్టికల్ ఇన్ స్పెక్టర్ ఆఫీస్, జీవిత బీమా జిల్లా అధికారి, డిడి షుగర్ కేన్, జైళ్ల శాఖ జిల్లా అధికారి, డివిజనల్ పైర్ ఆఫీసర్, సైనిక్ వెల్ఫేర్ అధికారి తదితర కార్యాలయాలు ప్రతీ చోట ఉండాల్సిన అవసరం లేదు. అవసరాన్ని బట్టి కార్యాలయాలుండాలి” అని సిఎం చెప్పారు.
“జిల్లాల పునర్వ్యస్థీకరణను ఓ అవకాశంగా తీసుకుని ప్రజలకు మెరుగైన సేవలు అందించడం కోసం ఇంకా ఎలాంటి కార్యక్రమాలు చెప్పట్టవచ్చో అధికారులు సూచనలు చేయాలి. తెలంగాణ పరిస్థితులను అవగతం చేసుకుని, ఇక్కడి భవిష్యత్ ను దృష్టిలో పెట్టుకుని ఆచరణీయమైన పద్ధతులు అన్వేషించాలి. మంచి పాలన అందించడం కోసం ప్రభుత్వానికి మీరు చేసే సూచనలు చాలా కీలకమని సిఎం అన్నారు.