ఎన్‌డీఏ కూటమి తరపున రాష్ట్రపతి అభ్యర్థిగా రామ్‌నాథ్‌కోవింద్ అట్టహాసంగా నామినేషన్ దాఖలుచేశారు. ప్రధాని నరేంద్రమోడీతో కేంద్రమంత్రులు, వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమక్షంలో శుక్రవారం మధ్యాహ్నం 12 గంటలకు ఎన్నికల రిటర్నింగ్ అధికారి అయిన లోక్‌సభ సెక్రటరీ జనరల్ అనూప్‌మిశ్రాకు మూడుసెట్ల నామినేషన్లు సమర్పించారు. మరో సెట్ ఈనెల 28న దాఖలుచేయనున్నారు.
ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ, తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల మధ్య ఆసక్తికరమైన సంభాషణ జరిగింది. కోవింద్ నామినేషన్ దాఖలు అనంతరం అందరూ బయటకు వస్తున్న సమయంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ని మోడీ ఆప్యాయంగా పలకరించారు. ఈ సమయంలో రాష్ట్రంలో వర్షాలు ఎలా పడుతున్నాయని మోడీ ఆరా తీశారు. వర్షాలు బాగా కురుస్తున్నాయని, గతేడాది కూడా బాగా పడ్డాయని కేసీఆర్ తెలిపారు.
ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు జోక్యం చేసుకుంటూ.. ఏపీలో వర్షాలు అంతగా కురవటం లేదన్నారు. మధ్యప్రదేశ్, మహారాష్ట్ర సీఎంలు తమ రాష్ట్రాల్లో వర్షపాతం అంతగా లేదని ప్రధాని దృష్టికి తీసుకొచ్చారు. అనంతరం మోదీ కేసీఆర్‌ను ఉద్దేశించి.. మీరు నీటి మనిషి. సాగు, తాగునీటి ప్రాజెక్టులు చేపడుతూ అందరికీ నీళ్లిచ్చే ఆశయంతో పనిచేస్తున్నారు. అందుకే రాష్ట్రంలో వర్షాలు బాగా కురుస్తున్నాయి అని వ్యాఖ్యానించినట్లు సమాచారం.