సీఎం కేసీఆర్ ఎప్పుడు ఏ వ్యూహాంతో ఏ నిర్ణయం తీసుకుంటారో ఎవరికీ అర్థం కాదు. తన వ్యూహాలు ప్రత్యర్థులకు అర్థమయ్యే సరికే కేసీఆర్ అనుకున్న వ్యూహాం నెరవేరిపోతుంది. అప్పుడు కానీ ప్రత్యర్థులకు మెలుకువ రాదు. ఇలాంటి సందర్భాలు చాలా ఉన్నాయి. ఈసారి కూడా సీఎం కేసీఆర్ తీసుకోబోతున్న నిర్ణయం కాంగ్రెస్ ను ఇరుకున పెట్టబోతుందా….? అంటే అవుననే సానుకూల సంకేతాలు కనిపిస్తున్నాయి. తెలంగాణలో ఇటీవల కాంగ్రెస్ బహిరంగ సభ నిర్వహించింది. రాహుల్ గాంధీని పిలిపించి మరీ రైతు డిక్లరేషన్ అంటూ హాడివిడి చేసింది. ఏకకాలంలో రైతులకు 2లక్షల రుణమాఫీ సహా పలు హామీలను ప్రకటించింది. ఇందులో కౌలు రైతులకు తాయిళాలు కూడా ఉన్నాయి. కాంగ్రెస్ కు అధికారం ఇవ్వండి చేసి చూపిస్తాం అని ఆ పార్టీ ప్రజలను కోరగా… మీరు అధికారంలో ఉన్న రాష్ట్రంలో ముందు చేసి ఇక్కడికి రండి అంటూ టీఆర్ఎస్ కౌంటర్ ఇచ్చింది.
అయితే, తెలంగాణలో రైతులకు కరెంట్, రుణమాఫీ అంశాలు త్వరగా కనెక్ట్ అవుతాయని విశ్లేషకులు ఎప్పుడూ చెప్పే మాటే. అయితే, ఈ విషయంలో తమకు పాజిటివ్ రెస్పాన్స్ ఉందని కాంగ్రెస్ భావిస్తున్న తరుణంలో… కాంగ్రెస్ కు చెక్ పెట్టేందుకు సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకోబోతున్నారన్న చర్చ జరుగుతుంది. ఇప్పటికే సీఎం కేసీఆర్ రుణమాఫీపై హామీ ఇచ్చి ఉన్నారు. గత ఎన్నికల హామీ ఇంకా పూర్తిగా అమలు కాలేదు. దీంతో వాయిదా పద్ధతిలో కాకుండా ఒకేసారి రుణమాఫీ చేసి… బ్యాంకుల నుండి రైతులకు ఇబ్బందులు లేకుండా చేసేందుకు సీఎం ఆర్థిక శాఖతో కసరత్తులు చేస్తున్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ హామీ మాత్రమే ఇస్తుంది… కానీ కేసీఆర్ ఆచరించి చూపిస్తారని నిరూపించే రూట్ లో కేసీఆర్ ఉన్నట్లు ఆ పార్టీ వర్గాల కథనం. అదే జరిగితే తమకు పాజిటివ్ గా మారిందనుకున్న రుణమాఫీ అంశం టీఆర్ఎస్ ఎగురేసుకపోయినట్లు అవుతుందని, పైగా వచ్చే ఎన్నికలకు కేసీఆర్ ఇచ్చే మరిన్ని హామీలతో కాంగ్రెస్ కు కోలుకోలేని దెబ్బే అంటున్నారు రాజకీయ పండితులు.