ఛత్తీస్ గఢ్ ల నక్సలైట్లను సంపిందే సంపుతున్నరు.. నక్సలైట్లేమో మమ్ముల పిలువుండి, మాట్లాడుండి అని నెత్తీ నోరు కొట్టుకొని చెప్తున్నరు , పిలిస్తే ఏం పాయె ? కోసుకుంట పోవుడేనా?, మావోయిస్టులను చర్చలకైతే పిలవండి అని కేంద్రానికి సూచించారు మాజీ సీఎం కేసీఆర్.
వరంగల్ బీఆర్ఎస్ రజతోత్సవ సభలో మాట్లాడిన కేసీఆర్… 11 ఏండ్లు రాజ్యమేలితే.. తెలంగాణకు బీజేపీ 11 పైసలియ్యలేదు అన్నారు. తెలంగాణ అయిందని ప్రజలు సంతోష పడుతుంటే ప్రధానమంత్రేమో తల్లిని సంపిన్రు – బిడ్డను బతికిచ్చిన్రు అంటడు, దేశంలో 150 మెడికల్ కాలేజీలు పెడితే తెలంగాణకు ఒక్కటియ్యడు అన్నారు.
ఉల్టా 7 మండలాలు గుంజుకున్నరు, సీలేరు ప్రాజెక్టు గుంజుకున్నరు.. ఒక్క ప్రాజెక్టుకన్నా జాతీయ హోదా ఇయ్యమంటే.. ఇయ్యరు, రేకు డబ్బాల రాళ్లేసి ఊపినట్టు.. బొబ్బ ఎక్కువ అన్నారు. శుష్క ప్రియాలు, శూన్య హస్తాలు… బభ్రాజ మానం భజ గోవిందం అన్నారు. యావన్మంది తెలంగాణ ప్రజలకు నేను వినయ పూర్వకంగా విజ్ఞప్తి చేస్తున్నా.. ఈ కాంగ్రెస్ చేసిన భారీ మోసం నుండి, అది సృష్టిస్తున్న ఉత్పాతం నుండి ఏ విధంగా బయట పడాల్నో యువత, సమాజం ఆలోచించాలె అన్నారు.
ఎవనెవని కథేందో అర్ధమైంది గనుక ఆలోచనతో పనిచెయ్యాలె.. ముల్లును ముల్లుతోనే తియ్యాలె , పోడగొట్టుకున్న కాన్నే దేవులాడుకోవాలె అన్నారు. మేం పుట్టిందే తెలంగాణ కోసం… తెలంగాణ సల్లగుండాలనే తప్ప గులాబీ జెండాకు ఇంకో ఆలోచన ఉండదు అన్నారు. యాడాదిన్నరకే ఇంత పెద్ద సభ విజయవంతం చేసిన్రంటే.. మీరు కూడా ఒక నిర్ణయానికి వచ్చినట్టు అర్థమవుతున్నది, ఓట్లు జల్దీ వస్తే బాగుండు అనే ముచ్చటనే ఉన్నది.. గీ ముచ్చట జనాల నుండి విని మా ఎమ్మెల్యేలు మాట్లాడితే ప్రజల మాటను మా వాళ్లు చెప్పిన్రు, అగో చూసిన్రా మా గవర్నమెంటు పడగొడ్తరని మా మీద నిందలు మోపుతున్నరు… మీరే చెడిపోయి పడిపోతుంటే… మేమెందుకు పడగొడ్తం, మేం ప్రజల దీవెనతోని మళ్లా రావాలె అన్నారు.
Also Read:24 గంటల కరెంట్ ఇవ్వలేదా?: కేసీఆర్
మన పార్టీ పుట్టిందే పదవీ త్యాగాలతో.. లక్ష్యాన్ని నెరవేర్చినం, తెలంగాణ సాధించినం, సగర్వంగా నిలబెట్టినం… ఆ ఖ్యాతి మనకే ఉంటది,పార్టీ పుట్టిన్నాడు మఖల పుట్టి పుబ్బల పోతదన్నరు…అట్లా అన్నోడే ఇవాళ విజయవాడ కరకట్ట మీద కూసున్నడు – మనం పోలే అన్నారు. ఇవాళ సగర్వంగా రజతోత్సవాలు జరుపుకొంటున్నం..బీఆర్ఎస్ చిరస్థాయిగా నిలిచే పార్టీ, తెలంగాణలో ప్రతి మనిషి ముఖం మీద చిరునవ్వులు విరిసేదాకా మన పోరాటం సాగుతూనే ఉంటది అని స్పష్టం చేశారు.

