టాలీవుడ్ కు చెందిన పలువురు హీరో,హీరోయిన్లు,దర్శకులు ఇప్పటికే రకరకాల వ్యాపారాల్లోకి అడుగు పెట్టారు. తాజాగా చిరు ఉయ్యాలవాడ దర్శకుడు సురేందర్ రెడ్డి కూడా రెస్టారెంట్ బిజినెస్ లోకి అడుగుపెట్టాడు. హైదరాబాద్ లో ఎంతో పాపులర్ అయిన ఉలవచారు రెస్టారెంట్ ఫ్రాంఛైజీని తీసుకున్న సురేందర్ రెడ్డి…. గచ్చిబౌలిలో దీనిని ప్రారంభించాడు. ఈ రెస్టారెంట్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి టీఆర్ఎస్ ఎంపీ కవిత, హీరో రామ్ చరణ్ లు విచ్చేశారు.
జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. సినీ ప్రముఖులు దిల్ రాజు, జగపతి బాబు, వివి వినాయక్, క్రిష్ తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా సురేందర్ రెడ్డికి వీరంతా శుభాకాంక్షలు తెలిపారు.
కాగా, తెలుగు సినీ ప్రముఖులు సందీప్ కిషన్, లక్ష్మీ మంచు, అనిల్ సుంకర, నవదీప్, కోన వెంకట్, శశాంక్, తదితరులు ఇప్పటికే రెస్టారెంట్ల వ్యాపారంలోకి అడుగుపెట్టారు. ఇప్పుడు తాజాగా, సురేందర్ రెడ్డి వీరి జాబితాలో చేరారు. వీరిలో కాస్త భిన్నంగా రకుల్ మాత్రం జిమ్ బిజినెస్‌లో రాణిస్తోంది. హైదరాబాద్, విశాఖలో జిమ్ బ్రాంచిలను ఏర్పాటుచేసిన రకుల్ త్వరలో మూడో బ్రాంచిని కూడా ప్రారంభించబోతోంది.