గడ్డం గీసుకున్నా పర్వాలేదు…అడ్డం పడకు

248
online news portal
- Advertisement -

పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి గడ్డం తీసుకున్నా, తీసుకోకపోయినా మా పార్టీకి సంబంధం లేదని…. అభివృద్ధి కార్యక్రమాలకు అడ్డుపడకుండా ఉంటే చాలని ఎంపీ కవిత అన్నారు. జగిత్యాల జిల్లా మెట్ పల్లిలో కాంగ్రెస్,టీడీపీ,బీజేపీ నాయకులు టీఆర్ఎస్‌లో చేరిన సందర్భంగా మాట్లాడిన ఆమె కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చే వరకు గడ్డం తీయనన్న ఆయన మాటల్లో అధికారంపై యావ తప్ప ప్రజాసంక్షేమంపై ధ్యాసలేదని దుయ్యబట్టారు.

ప్రజాసంక్షేమం, అభివృద్ధిని చూసి ఓర్వలేక ప్రతిపక్షాలు ప్రభుత్వంపై అక్కసుతోనే విమర్శలు చేస్తున్నాయని మండిపడ్డారు. పేదల కోసం సంక్షేమ పథకాలు అమలుచేయడం, సాగు, తాగునీటి కోసం ప్రాజెక్టులు కట్టడంతోపాటు అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతుంటే అన్యాయంగా కనిపిస్తున్నదా అని ఉత్తమ్‌కుమార్‌రెడ్డి వ్యాఖ్యలపై మండిపడ్డారు.

Kavitha-fires-on-uttam

భవిష్యత్‌లో తెలంగాణలో మిగిలేది, టీఆర్‌ఎస్ మాత్రమేనని ధీమా వ్యక్తంచేశారు. పార్టీలో కష్టపడి పనిచేసిన ప్రతి ఒక్కరికీ తప్పకుండా గుర్తింపు ఉంటుందన్నారు కవిత.పదేండ్ల కాంగ్రెస్ పాలనలో తెలంగాణకు చేసిందేమీలేదన్నారు. ఎంత సేపు అధికారం, ఓట్ల ధ్యాస తప్ప ఆ పార్టీకి ప్రజ సంక్షేమం, అభివృద్ధి పట్టదని మండిపడ్డారు. ప్రజలే ఎజెండాగా టీఆర్‌ఎస్ ప్రభుత్వం పనిచేస్తున్నదని స్పష్టం చేశారు.

బలమైన రాజకీయ శక్తిగా ఎదగడంతోపాటు, ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని చూసే టీఆర్‌ఎస్‌లో చేరేందుకు కాంగ్రెస్, బీజేపీ, టీడీపీల నుంచి అనేక మంది నాయకులు మొగ్గుచూపుతున్నారని కవిత స్పష్టం చేశారు. ఉద్యమంలో కన్నకలలను సాకారం చేసేందుకు సీఎం కేసీఆర్ నిరంతరం కష్టపడుతున్నారని చెప్పారు. తెలంగాణకు నిధుల కేటాయింపులో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పక్షపాత ధోరణి అవలంభిస్తున్నదని ఆరోపించారు. ఇప్పటి వరకు రూ.90 వేల కోట్లు ఇచ్చామని ఆ పార్టీ నాయకులు చెప్తున్నారని, వాస్తవానికి రెండేండ్లలో కేంద్రం ఇచ్చిన నిధులు రూ.1,200 కోట్లు మాత్రమేనన్నారు.

- Advertisement -