బుల్లితెర కామెడీషోలల్లో ‘జబర్థస్త్’ షో ఎంత పాపులర్ అయిందో తెలిసిందే. ఈ షోలో కామెడీతో పాటు కొందరిపై సెటైర్లు కూడా వినిపిస్తున్న విషయం కూడా అందరికీ తెలసిందే. అయితే రానురాను జబర్థస్త్ షో వివాదాలను మూటగట్టుకుంటోంది.
ఇప్పటికే వైసీపీ ఎమ్మెల్యే రోజా, నటుడు నాగబాబు జడ్జిలుగా వ్యవహరిస్తున్న ఈ కార్యక్రమంపై రోజురోజుకూ విమర్శలు పెరిగిపోతున్నాయి. మొన్నటికి మొన్న ఫిలిం క్రిటిక్ కత్తి మహేష్ పై సెటైర్ వేశాడు హైపర్ ఆది. ఆ సెటైర్ కాస్త కొన్ని రోజులు సోషల్ మీడియాలో హల్చల్ చేసింది. తాజాగా ఇప్పుడు కత్తి మహేష్ హైపర్ ఆదికి షాకిచ్చాడు.
ఈ కార్యక్రమంలో అసభ్యత శ్రుతి మించుతూ. ఇదే సమయంలో అనాథలు, మహిళలు, వికలాంగులను కించపరిచేలా జోకులు ఉంటున్నాయని, ఈ నేపథ్యంలో హైపర్ ఆది, జబర్దస్త్ షోలపై అనాథ పిల్లలు, ఫిలిం క్రిటిక్ కత్తి మహేష్ హెచ్చార్సీలో ఫిర్యాదు చేశారు. హైపర్ ఆది, రోజా, నాగబాబు, అనసూయ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.
జబర్దస్త్ కార్యక్రమంపై వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు. ఇక ఈ విషయాన్ని కత్తి మహేష్ ఫేస్ బుక్ ద్వారా తెలిపాడు. బాలల హక్కులు, మానవ హక్కులను నాశనం చేసేలా జబర్దస్త్ లో స్కిట్లు వేస్తుండటం పట్ల కేసు నమోదైందని మహేష్ తెలిపాడు. అంతేకాకుండా తన మద్దతు అనాథలకే అని చెప్పాడు.