దివంగత నటుడు స్వర్గీయ ఎన్టీరామారావు జీవిత నేపథ్యంలో ఎన్టీఆర్ బయోపిక్ రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని ఎన్టీఆర్ తనయుడు బాలయ్య స్వయంగా నిర్మిస్తుండగా సాయి కొర్రపాటి, విష్ణు సహ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. వచ్చే ఏడాది జనవరి 9న ‘యన్.టి.ఆర్-కథానాయకుడు’, జనవరి 24న ‘యన్.టి.ఆర్- మహానాయకుడు’గా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటి వరకు చిత్రానికి సంబంధించి పలు పోస్టర్స్ విడుదల కాగా, ఇవి సినిమాపై అంచనాలు పెంచాయి.
తాజాగా ఈ మూవీ నుండి తొలి పాట లిరికల్ వీడియో కొద్దిసేపటి క్రితం విడుదలైంది. ఘనకీర్తిసాంధ్ర, విజితాఖిలాంధ్ర, జనతా సుదీంధ్ర, మణిదీపకా… అంటూ సాగే పాట లిరిక్స్ ఆకట్టుకుంటున్నాయి. కీరవాణి స్వరపరచిన ఈ పాటలో మూడు వందలకు పైగా చిత్రాల్లో నటించిన ఎన్టీఆర్ ను గుర్తు చేస్తూ, ఆయన పోషించిన పలు పాత్రల పేర్లను చేర్చారు. కే శివదత్త, డాక్టర్ కే రామకృష్ణలు ఈ పాటను రాయగా, కైలాష్ ఖేర్ ఆలపించాడు.
“భీమసేన వీరార్జున కృష్ణ దానకర్ణ మానధన సుయోధన భీష్మ బృహన్నల విశ్వామిత్ర లంకేశ్వర దశకంఠరావణా, సురాధి పురాణ పురుష భూమికా పోషకా…” అనడం బాగుంది. రిలీజైన నిమిషాల వ్యవధిలోనే లక్షల వ్యూస్ తెచ్చుకున్న ‘కథానాయకుడు’ తొలి పాట లిరికల్ వీడియోను మీరూ చూడండి.