పాంచరాత్ర ఆగమ వైశిష్ట్యం
తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయ వార్షిక కార్తీక బ్రహ్మూత్సవాలు నవంబరు 26 నుంచి డిసెంబరు 4వ తేదీ వరకు ఘనంగా జరుగనున్నాయి. అమ్మవారి ఆలయంలో పాంచరాత్ర ఆగమం ప్రకారం కైంకర్యాలు నిర్వహిస్తున్నారు. బ్రహ్మూెత్సవాల నేపథ్యంలో పాంచరాత్ర ఆగమ విశిష్టతను తెలుసుకుందాం.
సాక్షాత్తు భగవంతుడే ఉపదేశించినది పాంచరాత్ర ఆగమం. భగవంతుని చేరుకునేందుకు గల మార్గాలను నిర్దేశించినవి ఆగమాలు. భగవంతుడిని ఎలా అర్చించాలి, ఎలా ప్రతిష్ఠించాలి, ఏడాదిలో జరిగే నిత్యము, నైమిత్తికము, కామ్యము అనే ఉత్సవాలను ఎలా నిర్వహించాలి, కంకణబట్టర్ ఎలాంటి అధ్యయనం చేయాలి, ఉత్సవాలు నిర్వహించే యజమానికి ఎలాంటి లక్షణాలు ఉండాలి అనే విషయాలను ఆగమాలు తెలియజేస్తున్నాయి. పాంచ అంటే ఐదు, రాత్ర అంటే రోజులు అని అర్థం. భగవంతుడు ఐదు రోజుల పాటు నాగరాజు అయిన అనంతుడు, గరుత్మంతుడు, విష్వక్సేనమూర్తి, చతుర్ముఖ బ్రహ్మ, పరమేశ్వరుడు అనే ఐదుగురికి ఉపదేశించినవి కావున దీనికి పాంచరాత్రం అనే పేరు వచ్చింది. ఇది మనుషుల అజ్ఞానాన్ని పోగొట్టి జ్ఞానాన్ని ప్రసాదిస్తుంది.
లోకంలో ప్రతి జీవి పునరావృత్తి రహిత శ్రీవైకుంఠానికి చేరి శాశ్వతమైన ఆనందం పొందేందుకు పాంచరాత్రం దోహదపడుతుంది. ఈ ఆగమంలో భగవంతుని సేవించేందుకు దివ్యము, ఆర్ఘ్యము, దైవము తదితర 108 పూజా విధానాలున్నాయి. శ్రీ పాద్మ సంహిత, శ్రీ ప్రశ్న సంహిత మొదలైన శాస్త్రాల్లో సూచించిన ప్రకారం శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో నిత్య, నైమిత్తిక, కామ్యోత్సవాలను జరుపుతున్నారు. బ్రహ్మూత్సవాలు, వసంతోత్సవాలు, పవిత్రోత్సవాలు, తెప్పోత్సవాలు, సుందరరాజస్వామివారి అవతారోత్సవాలు, నవరాత్రి ఉత్సవాలను నిత్యోత్సవాలుగా, సంక్రాంతి, గ్రహణం సందర్భంగా చేపట్టే క్రతువులను నైమిత్తిక ఉత్సవాలుగా, భక్తుల కోరిక మేరకు నిర్వహించే ఆర్జితసేవలను కామ్యోత్సవాలుగా పిలుస్తారు.
చతుష్టానార్చన విశేషం
శ్రీ పద్మావతి అమ్మవారి బ్రహ్మూత్సవాల్లో చతుష్టానార్చనకు విశేష ప్రాముఖ్యత ఉంది. ప్రతిరోజూ ఉదయం 5 నుంచి 6 గంటల వరకు, సాయంత్రం 4 నుంచి 5.30 గంటల వరకు యాగశాలలో అర్చకులు శాస్త్రోక్తంగా చతుష్టానార్చన నిర్వహిస్తారు. శ్రీవైకుంఠం నుంచి పరవాసుదేవుడిని జలం, మహాలక్ష్మిని కుంభం, అగ్నిదేవుడిని హోమం, చక్రాబ్జమండలాన్ని అక్షింతలు, యాగబేరాన్ని బింబం ద్వారా ఆవాహన చేస్తారు. దీనివల్ల అనిష్ట నివృత్తి, ఇష్ట ప్రాప్తి చేకూరుతాయి.