బండి సంజయ్‌పై మండిపడ్డ‌ కర్నె ప్రభాకర్‌..

261
Karne Prabhakar On BJP Leaders
- Advertisement -

కృష్ణానది నీటిని పోతిరెడ్డిపాడు నుంచి రోజుకు 3 టీఎంసీల వంతున తరలించాలని ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై తెలంగాణ అభ్యంతరం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. దీనిపై న్యాయపోరాటం చేస్తామని తెలంగాణ సీఎం కేసీఆర్ చెప్పారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ విప్ కర్నె ప్రభాకర్ హైదరాబాద్‌లో దీనిపై ‘వీడియో”నోట్ విడుదల చేశారు.

పోతి రెడ్డి పాడుపై మా పార్టీకి, ప్రభుత్వానికి స్పష్టమైన విధానం ఉంది.ఓ పోతిరెడ్డి పాడే కాదు,గోదావరి, కృష్ణా నదుల్లో తెలంగాణకు వాటా గురించి గతంలో పోరాడిన వాళ్ళం. రాయలసీమకు అక్రమంగా ఒక్క నీటి బొట్టును తరలించినా ఊరుకునేది లేదని గతంలో చెప్పాము. ఇపుడు కూడా చెబుతున్నాం. ఈ నెల 5న ఏపీ ప్రభుత్వం పోతి రెడ్డి పాడు నుంచి 80 వేల క్యూసెక్కులను అక్రమంగా తరలించేందుకు జీవో విడుదల చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు కర్నె ప్రభాకర్.

ఇప్పటికే ఈ అంశంపై సీఎం కెసిఆర్ దక్షిణ తెలంగాణకు సంబంధించిన మంత్రులు,పార్టీ నేతలు, ఇరిగేషన్ నిపుణులతో చర్చించారు. బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్‌తో పాటు సుప్రీం కోర్టులో ఏపీ ప్రభుత్వ అక్రమ నీటి తరలింపులపై పోరాడతామని సీఎం కెసిఆర్ స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వ విధానాలపై అవగాహన, సమాచారం లేని బీజేపీ అధక్షుడు బండి సంజయ్ బుధవారం నల్ల జెండాలతో ప్రదర్శనలు జరపాలని పిలుపు నివ్వడం హాస్యాస్పదంగా వుంది. నల్ల జెండాలతో నిరసనలు కాదు కావాల్సింది.. పోతిరెడ్డి పాడు నుంచి అక్రమ నీటి తరలింపుపై బీజేపీ నిఖార్సుగా పోరాడితే చాలు అన్నారు.

పోతి రెడ్డి పాడు నుంచి అక్రమంగా నీటి తరలింపును ఏపీ బీజేపీ స్వాగతిస్తోంది. బండి సంజయ్‌కి దమ్ముంటే తెలంగాణ ప్రయోజనాలకు వ్యతిరేకంగా వెళ్తున్న ఏపీ బీజేపీ నేతలను ప్రశ్నించాలి. పోతి రెడ్డి పాడుపై ఏపీ బీజేపీ నేతలు ఓ రకంగా.. తెలంగాణ బీజేపీ నేతలు మరో రకంగా మాట్లాడటం జాతీయ పార్టిగా చెప్పుకునే బీజేపీ ద్వంద్వ ప్రమాణాలకు నిదర్శనం. ఏపీ బీజేపీ నేతల విధానం కరెక్టో ,తెలంగాణ బీజేపీ నేతల విధానం రైటో జాతీయ బీజేపీ నాయకత్వం స్పష్టం చేయాలి అని కర్నె ప్రభాకర్‌ అన్నారు.

బీజేపీలో పోతిరెడ్డి పాడుపై ఏకాభిప్రాయం వచ్చాక బండి సంజయ్ మాట్లాడితే మంచిది. బండి సంజయ్ ఏం మాట్లాడినా నమ్మేందుకు తెలంగాణ ప్రజలు అమాయకులు కారు.బీజేపీకి చిత్తశుద్ధి ఉంటే పోతిరెడ్డి పాడు నుంచి అక్రమ నీటి తరలింపుపై రాష్ట్రప్రభుత్వం చేసే పోరాటంలో కలిసి రావాలి అని ప్రభుత్వ విప్ కర్నె ప్రభాకర్ తెలిపారు.

- Advertisement -