ముఖ్యమంత్రిపై పగబట్టిన కాకి….

222
Karnataka CM and his relationship with crows
- Advertisement -

అదేంటి కాకి ముఖ్యమంత్రిపై పగబట్టడం ఏంటనుకుంటున్నారా ? వినడానికి కాస్త నవ్వుతెప్పించేదే ఐనా…ఆ ముఖ్యమంత్రి పరిస్ధితి దాదాపు అలానే ఉంది. ఎందుకంటే ఆ ముఖ్యమంత్రి ఇప్పటికే కాకి తెచ్చిన తంటాతో ఇబ్బంది పడుతుంటే తాజాగా మరోసారి ఆయన్ని వార్తల్లో వచ్చేలా చేసింది. వివరాల్లోకి వెళ్తే..

కాకి కావ్ కావ్ మన్న రోజు ఖచ్చితంగా ఇంటికి ఆ రోజు చుట్టాలొస్తున్నట్లు అంటారు. కానీ ఆయనను మాత్రం కాకి నీడలా వెంటాడుతోంది. ఇంతకీ ఎవరా ముఖ్యమంత్రి అనుకుంటున్నారా? ఆయనే కర్ణాటక సీఎం సిద్ధ రామయ్య. ఇప్పుడే ఇదే కర్ణాటక రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది.

గురువారం ఓ సాంస్కృతిక సంస్థ ఏర్పాటు కార్యక్రమంలో పాల్గొనేందుకు సిద్ధరామయ్య కేరళలోని మంజేశ్వర్ అనే ప్రాంతానికి వెళ్లారు. ఆ కార్యక్రమానికి సిద్ధ రామయ్యతో పాటు కేరళ సీఎం పినరయ్ విజయన్ కూడా విచ్చేశారు. వీరిద్దరితో పాటు ఇతర ప్రజాప్రతినిధులు సైతం హాజరయ్యారు. వక్తలు ప్రసంగిస్తుండగానే వేధిక పక్కనే ఉన్న ఓ చెట్టు పై నుంచి ఓ కాకి వచ్చి సిద్దరామయ్యపై రెట్టవేసి తిరిగి చెట్టుపైకి వెళ్లిపోయింది.

Karnataka CM and his relationship with crows

దీంతో ఖంగుతిన్న సిద్దరామయ్య దగ్గరకు నాయకులు వెల్లి కాకి రెట్టను తుడిచివేశారు. పక్కనే ఉన్న సిబ్బంది వెంటనే చెట్టు దగ్గరకు వెళ్లి కాకులను అక్కడి నుంచి తరిమివేశారు. అయితే కాకులతో సిద్ధరామయ్యకు ఇదేమీ మొదటి సమస్యకాదు. అంతకు ముందు ఆయన వాడిన వాహనం బానెట్‌పై కాకి తిష్టవేసిందట. దాన్ని సిబ్బంది తరిమినా వెళ్లకుండా పది నిమిషాల పాటు కారు బోనెట్ పైనే ఉండిపోయిందట.

దీంతో అసలు జాతకాలపై విపరీతమైన నమ్మకం ఉండే సిద్దరామయ్య కారును మార్చివేశారు. దాదాపు రూ. 35 లక్షలు పెట్టి కొత్తకారును కొన్నారు. ఇదే అప్పుడు సిద్ధ రామయ్యకు తలనొప్పి తెచ్చిపెట్టింది. పాత కారుపై కాకి వాలడం వల్లే సిద్ధ రామయ్య కారు మార్చారంటూ ప్రతిపక్షాలు మండిపడ్డాయి. సీఎంగా బాధ్యతగా ఉండాల్సిన వ్యక్తి ఇలా జాతకాల పిచ్చితో ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని విమర్శలు రావడంతో సిద్ధరామయ్య వివరణ కూడా ఇచ్చారు.

- Advertisement -