గత కొన్ని రోజులుగా కర్ణాటకలో గల్లీ గల్లీనా మోత మ్రోగిన ప్రచార మైకులు నేటితో మూగబోనున్నాయి. మరో మూడు రోజులలో కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈ రోజు సాయంత్రం 5 గంటలకు ప్రచారం ముగిస్తుంది. నేటితో ప్రచారానికి చివరి రోజు కావడంతో ప్రధాన పార్టీలు ఓటర్లను ఆకర్షించేదుకు పలుచోట్ల భారీ బహిరంగ సభలు ఏర్పాటుచేశాయి. బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా బాదామీలో జరిగే సభలో పాల్గొననున్నారు. ఇక కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ హుబ్లీలో ర్యారీ నిర్వహించి, భారీ బహిరంగ సభలో ప్రసంగించనున్నారు.

ఇక మరోవైపు బయటి నుంచి వచ్చిన వారంతా సాయంత్రాని కల్లా.. వెళ్లిపోవాలని ఈసీ ఆదేశాలు జారీ చేసింది. నియోజకవర్గాల్లో ఆ పార్టీకి చెందిన నేతలు మాత్రమే ఉండాలని.. ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన నేతలుంటే కఠిన చర్యలు తప్పవని ఈసీ హెచ్చరించింది. సాయంత్రం 5 గంటల తర్వాత ఎలాంటి ప్రచార కార్యక్రమం నిర్వహించరాదని ఈసీ సూచించింది. 12న
జరిగే ఎన్నికలకు పూర్తి ఏర్పాట్లు చేశామని తెలిపింది.

50 వేలకు పైగా ఈవీఎంలను సిద్దం చేశామని, 450 పోలింగ్ స్టేషన్లను మహిళలే నిర్వహిస్తారని తెలిపింది. ఎలాంటి అవాంతనీయ సంఘటనలు జరగకుండా భారీ బంధోబస్తు ఏర్పాటు చేశామని, సున్నిత, అతి సున్నిత ప్రాంతాలలో సీసీ కెమెరాలతో నిఘా పెట్టామని ఈసీ వెల్లడించింది. ఈ నెల 12న ఫోలింగ్ జరగగా.. 15న ఫలితాలు వెలువడనున్నాయి. కర్ణాటక ఎన్నికలే ప్రధాన ఎజెండాగా పెట్టుకున్న బీజేపీ, కాంగ్రెస్ లకు కన్నడిగులు ఎవరివైపు మొగ్గుచూపుతారో తెలియాలంటే మరో 5 రోజులు వేచి చూడాల్సిందే.

