తెలంగాణకు చెందిన మరో యువ క్రికెటర్ ఐపీఎల్‌లో చోటు దక్కించుకున్నాడు. కరీంనగర్ జిల్లాకు చెందిన అమన్ రావు ఐపీఎల్ వేలంలో ఎంపికై క్రికెట్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాడు. మంగళవారం నిర్వహించిన ఐపీఎల్ వేలంలో రాజస్థాన్ రాయల్స్ జట్టు అమన్ రావును రూ.30 లక్షలకు కొనుగోలు చేసింది. దీంతో అమన్ తన క్రికెట్ కెరీర్‌లో కీలకమైన మైలురాయిని చేరుకున్నాడు.
అమన్ రావు స్వగ్రామం కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలం వెన్నంపల్లి గ్రామం. గ్రామీణ నేపథ్యం నుంచి వచ్చి ఐపీఎల్ వరకు ఎదగడం ఎంతో మంది యువ క్రికెటర్లకు ప్రేరణగా నిలుస్తోంది. ప్రస్తుతం అమన్ హైదరాబాద్ జట్టు తరపున అండర్-23 విభాగంలో రంజీ క్రికెట్ టోర్నీలో మ్యాచ్‌లు ఆడుతూ తన ప్రతిభను నిరూపించుకుంటున్నాడు. ఆల్‌రౌండర్‌గా గుర్తింపు పొందిన అమన్, బ్యాటింగ్‌తో పాటు బౌలింగ్‌లోనూ నిలకడగా రాణిస్తున్నాడు.
కరీంనగర్ హిందూ క్రికెట్ జట్టులో సభ్యుడిగా కొన్నేళ్ల క్రితం జిల్లా స్థాయి క్రికెట్ ఆడిన అమన్, క్రమంగా రాష్ట్ర స్థాయికి చేరాడు. చిన్నతనంలోనే క్రీడలపై ఆసక్తి పెంచుకున్న అమన్‌కు కుటుంబం నుంచి పూర్తి మద్దతు లభించింది. అమన్ తండ్రి పేరాల మధుసూదన్ రావు కుమారుడి విజయంపై ఆనందం వ్యక్తం చేస్తూ, పట్టుదలతో శ్రమిస్తే ఏ లక్ష్యమైనా సాధించవచ్చని తెలిపారు. అమన్ ఐపీఎల్‌లో మంచి ప్రదర్శన చేసి తెలంగాణ పేరు మరింత వెలుగులోకి తేవాలని అభిమానులు ఆశిస్తున్నారు.
Also Read:వాట్సాప్ డేటా సేకరణ..అనుమతి తప్పనిసరి!

