‘బిగ్ బాస్’కు హోస్టుగా ప్రముఖ డైరెక్టర్‌..

145
Bigg Boss OTT

ఇండియన్ టెలివిజన్ రియాలిటీ షోలలో బిగ్ బాస్ షోకు ఉన్న ఆదరణ గురించి అందరికీ తెలిసిందే. ఈ క్రమంలో హిందీలో ఇప్పటికే పద్నాలుగు సీజన్లు పూర్తయ్యాయి. బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ తన వాక్చాతుర్యంతో అన్ని సీజన్లలోనూ ఆ షోను మరింతగా రక్తికట్టిస్తూ వచ్చాడు. అయితే, ఇప్పుడు ఈ హిందీ బిగ్ బాస్ షోకి హోస్టుగా కొత్తగా ఓ బడా ఫిలిం మేకర్ వస్తున్నాడు. అతనే దర్శక నిర్మాత కరణ్ జొహర్!

కొత్త సీజన్ ‘బిగ్ బాస్’ షోకి కొన్ని ఎపిసోడ్లకు కరణ్ హోస్టుగా వ్యవహరిస్తాడు. వీటిని టీవీలో కాకుండా, VOOT ఓటీటీలో స్ట్రీమింగ్ చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఆగస్టు 8న ఈ షో ప్రీమియర్ స్ట్రీమింగ్ కానుంది. ఓటీటీలో ప్రసారం అయ్యే కొన్ని ఎపిసోడ్లకు మాత్రమే కరణ్ హోస్టుగా ఉంటాడనీ, అనంతరం ‘కలర్స్’ టీవీలో ప్రసారమయ్యే ఎపిసోడ్లకు మాత్రం మళ్లీ యథావిధిగా సల్మాన్ ఖాన్ హోస్ట్ చేస్తాడని సమాచారం.

దీనిపై కరణ్ స్పందిస్తూ, “బిగ్ బాస్ షోకి మా అమ్మ, నేను పెద్ద ఫ్యాన్స్. ఒక్కరోజు కూడా మిస్ కాకుండా చూస్తాం. బిగ్ బాస్ షోకి నేను హోస్ట్ చేస్తే చూడాలన్నది మా అమ్మ కల. అది ఇప్పుడు నెరవేరుతోంది. మామూలుగా షోస్ హోస్ట్ చేయడాన్ని నేను ఎంతో ఎంజాయ్ చేస్తాను. అందుకే, బిగ్ బాస్ అభిమానులను నేను అలరించగలనని, వాళ్ల అంచనాలను చేరుకోగలనని నమ్ముతున్నాను” అని చెప్పాడు.

ఇప్పుడు కొత్త పద్దతిలో బిగ్ బాస్ షోను ముందుకు తీసుకురావాలని నిర్వాహకులు ఫిక్స్ అయ్యారు. ఈ క్రమంలోనే ఓటీటీలో బిగ్ బాస్ షోను ప్రసారం చేయబోతోన్నట్టు ప్రకటించారు. టీవీలో కంటే ముందుగానే ఓటీటీ ( bigg boss ott)లో రానుంది. దీంతో ఈ సీజన్‌కి బిగ్ బాస్‌ పేరులో కూడా మార్పులు చేశారు. బిగ్ బాస్ ఓటీటీ అనే ఈ కొత్త షోకు సంబంధించిన ప్రకటన వచ్చేసింది.