ఇప్పటికే చాలా రాష్ట్రాల్లో అధికారం కోల్పోయి సతమతమవుతున్న కాంగ్రెస్ పార్టీకి.. తాజాగా మరో బిగ్ షాక్ తగిలింది. కాంగ్రెస్ పార్టీకి అత్యంత సీనియర్ నేత, మాజీ మంత్రి కపిల్ సిబల్ రాజీనామా సమర్పించారు. అంతేకాదు ఎవరూ ఊహించని చర్యతో కపిల్ సిబల్ షాకిచ్చారు. బుధవారం సమాజ్ వాదీ పార్టీ (ఎప్పీ) మద్దతుతో రాజ్యసభకు స్వతంత్ర అభ్యర్థిగా ఆయన నామినేషన్ దాఖలు చేశారు. ఈ సమయంలో సిబల్ వెంట ఎస్పీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ తో పాటు ఆ పార్టీ నేతలు కూడా ఉన్నారు.
అనంతరం కపిల్ మీడియాతో మాట్లాడుతూ.. స్వతంత్ర అభ్యర్థిగా రాజ్య సభకు వెళ్లాలని అనుకుంటున్నాను. దయచేసి సహకారం అందించండి అంటూ అఖిలేశ్ జీని కోరాను. 30 ఏళ్ల తర్వాత పార్టీ నుంచి బయటకు వచ్చి స్వతంత్రంగా పనిచేయాల్సిన అవసరం వచ్చింది. కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా నేను ఇప్పుడు ఏమీ మాట్లాడను. విపక్షాల్లో చాలా వాటితో నాకు సత్సంబంధాలు ఉన్నాయి. ఉత్తరప్రదేశ్‌తో అనుబంధం ఉందని నా భార్య చెప్పింది అని కపిల్ సిబల్ పేర్కొన్నారు. మేము కూటమి ఏర్పాటు చేసి మోదీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పని చేయాలి. బీజేపీని వ్యతిరేకించే వాతావరణం ఏర్పాటు చేయాలి. ఆ దిశగా నేను పనిచేస్తాను అని సిబల్ ప్రకటించారు.
ఎస్పీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ మాట్లాడుతూ.. రాజ్య సభకు నేడు కపిల్ సిబల్ నామినేషన్ వేశారు. ఎస్పీ మద్దతుతో రాజ్యసభకు వెళుతున్నారు. మరో ఇద్దరు కూడా ఎస్పీ నుంచి రాజ్యసభలో అడుగు పెడుతున్నారు. కపిల్ సిబల్ సీనియర్ న్యాయవాది. ఆయన తన అభిప్రాయాలను పార్లమెంటులో చాలా చక్కగా వినిపిస్తారు. ఆయన సొంత అభిప్రాయాలతో పాటు, ఎస్పీ అభిప్రాయాలను కూడా వ్యక్తం చేస్తారని భావిస్తున్నాను అంటూ అఖిలేశ్ యాదవ్ అన్నారు.