న్యూజిలాండ్‌తో సిరీస్ సందర్భంగా టీమిండియా వరుస ఓటములపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఓ వైపు వన్డే మరోవైపు తొలిటెస్టులో ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది కోహ్లీ సేన. దీంతో కోహ్లీతో పాటు జట్టు సభ్యుల ఆటతీరుపై మాజీ ఆటగాళ్లు మండిపడుతున్నారు. జట్టు ఓటమికి కోహ్లీ వైఫల్యమే కారణమని దుయ్యబడుతున్నారు.
తాజాగా కపిల్ దేవ్ సైతం కోహ్లీ సేన ఆటతీరును తప్పుబడుతునే కివీస్‌పై ప్రశంసలు గుప్పించాడు. వన్డే, తొలి టెస్టుల్లో కివీస్ ఆడిన తీరు అమోఘం. ఓటమి తర్వాత వారు పుంజుకున్న విధానం, సారథిగా విలియమ్సన్ ముందుండి నడిపించే విధంగా నన్ను ఎంతగానో ఆకట్టుకుందన్నారు.
ఇక టీమిండియాపై ప్రశ్నల వర్షం కురిపించారు. ప్రతీ మ్యాచ్‌కు కొత్త జట్టా? పదకొండు మందితో కూడిన ఓ జట్టును వరుసగా మ్యాచులు ఆడించరా? ప్రతీ మ్యాచ్ కోసం జట్టులో మార్పులు చేస్తునే ఉంటారా? ఇలా మార్చుకుంటూ వెళ్లడం ద్వారా యువ ఆటగాళ్లకు ఏం సందేశం ఇవ్వదల్చుకున్నారు? అని మండిపడ్డారు కపిల్.
గత కొంతకాలంగా సీనియర్ ప్లేయర్స్ మినహా ఏ ఒక్క యువ ఆటగాడినైనా జట్టులో శాశ్వత స్థానం కల్పించారా? అంటూ టీమ్ మేనేజ్‌మెంట్‌ను ప్రశ్నించాడు. ఫామ్‌లో ఉన్న కేఎల్ రాహుల్‌ను టెస్టు జట్టులోకి తీసుకోలేదు…? మేటి బ్యాట్స్‌మెన్ ఉన్నా తొలి టెస్టులో ఒక ఇన్నింగ్స్‌లో కూడా 200 పరుగులు చేయకపోవడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఈ విషయంలో టీమ్ మేనేజ్‌మెంట్ తనను తాను ప్రశ్నించుకోవాలని చురకలంటించాడు కపిల్ దేవ్.